పూరి, బాలయ్య సినిమా క్లైమాక్స్ సీన్ రివీల్
- March 18, 2017 / 11:36 AM ISTByFilmy Focus
“గౌతమీ పుత్ర శాతకర్ణి’ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కారణం క్రేజీ కాంబినేషన్. అదిరిపోయే డైలాగులు రాసే డైరక్టర్ పూరి జగన్నాథ్ బాలయ్యను డైరక్ట్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న బాలకృష్ణ 101 వ సినిమా మార్చి 9న పూజా కార్యక్రమాలు జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ లోకి ఎంటర్ అయిపోయింది. గురువారం నుంచి ఒక ఫైట్ సీన్ చిత్రీకరణ మొదలుపెట్టారు. ఫైట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో బాలకృష్ణ, ఫైటర్లపై పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 21 వరకు హైదరాబాద్‌లోనే ఆ సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది.
ఈ మూవీలో క్లైమాక్స్ కోర్టులో ఉంటుందని సమాచారం. పూరి టెంపర్ లో ఎన్టీఆర్ తో కోర్ట్ సీన్ చేయించి హిట్ కొట్టారు. ఇజం లోను కోర్ట్ సీన్ హైలెట్. వాటి రెండింటికంటే మించిపోయేలా బాలయ్య కోసం కోర్ట్ సీన్ రాసారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అలనాడు మహానటుడు నందమూరి తారకరామారావు బొబ్బులి పులి చిత్రంలో కోర్టుబోనులో నిలబడి డైలాగ్స్ చెబుతుంటే ప్రేక్షకులు చప్పట్లతో హాల్స్ ని నింపేశారు. అదే సీన్ ఈ చిత్రానికి రిపీట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ నందమూరి అభిమానులు విజిల్స్ వేసేలా డైలాగ్స్ రాసి ఉంటారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















