తెలుగు సినిమా ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించినప్పటికీ, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో వివాదాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ప్రధాన సంగీత దర్శకుడిగా పనిచేసినప్పటికీ, బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ప్రాజెక్ట్‌లోకి మరో ముగ్గురు సంగీత దర్శకులను తీసుకురావడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చివరకు సామ్ సీఎస్ (Sam C. S.) సంగీతాన్ని మాత్రమే ఎక్కువగా ఉపయోగించారని, మిగతా వారి వర్క్ పక్కన పెట్టారని సమాచారం.
Pushpa 2 The Rule
థమన్ (SS Thaman), అజనీష్ లోక్ నాథ్ (B. Ajaneesh Loknath) వంటి మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు చివరకు క్రెడిట్స్‌లో లేకపోవడం ఆసక్తికరంగా మారింది. అయితే, మేకర్స్ టైటిల్స్‌లో సామ్ సీఎస్‌ను అడిషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రస్తావించారు. దీనిపై సామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ”బ్యాగ్రౌండ్ స్కోర్‌లో 90 శాతం వర్క్ నేనే చేశాను, కొన్ని కీలక సన్నివేశాలకు దేవి స్కోర్ చేశారు” అని చెప్పారు. అలాగే, దేవిశ్రీ ప్రసాద్ ఇతర ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండటం వల్ల తన దగ్గరకు ఈ అవకాశం వచ్చినట్లు వివరించారు.
తాజాగా టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్‌లో ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ (OST) విడుదల చేయడం చర్చనీయాంశమైంది. మొత్తం 33 నిమిషాల జ్యూక్ బాక్స్‌లో ప్రతి సౌండ్‌ట్రాక్‌ను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినట్లు పేర్కొన్నారు. కానీ సామ్ సీఎస్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ పరిణామాల మధ్య హఠాత్తుగా సామ్ తన సౌండ్ ట్రాక్స్‌ను త్వరలో విడుదల చేస్తానని చెప్పడం, క్రెడిట్ చర్చలను మరింత రగిలించింది.
సోషల్ మీడియాలో తన పోస్ట్‌లో ‘‘పుష్ప 2 OST.. లోడింగ్ 99%’’ అని ప్రకటించడంతో, ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. సామ్ తన సౌండ్‌ట్రాక్‌లను రిలీజ్ చేస్తే, సినిమాలో ఏయే సీన్లకు ఎవరి స్కోర్ వాడారు, అసలు క్రెడిట్ ఎవరికి దక్కాలి అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎవరి వాదనలు నిజమో తెలియడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘పుష్ప 2’ విజయంపై ఈ వివాదం ప్రభావం చూపకపోయినా, మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య ఈ పోరాటం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.