‘‘పుష్ప: ది రూల్’ (Pushpa 2 The Rule) సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ త్వరలోనే…’ గత కొన్ని రోజులుగా ఈ మాట టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. సినిమాలోని వీడియో సాంగ్స్ వరుస పెట్టి విడుదలవుతుండటమే దీనికి కారణం. ఓటీటీ పుకార్లు ఎక్కువవుతుండటంతో థియేటర్లలో సినిమాకు ఆదరణ తగ్గుతుంది అని టీమ్ వాసన పట్టిందేమో తాజాగా సినిమా ఓటీటీ ప్లానింగ్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. 56 రోజుల కాన్సెప్ట్‌లో ‘పుష్ప 2’ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసేశారు.
Pushpa 2 The Rule
వైల్డ్‌ఫైర్ అని సుకుమార్ (Sukumar) డైలాగ్ ఎందుకు రాశారో కానీ.. సినిమా ఇప్పుడు అలా దేశం మొత్తం వ్యాపిస్తోంది. అలా దేశం మొత్తం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. తాజాగా రూ.1500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా రూ.2000 కోట్ల క్లబ్‌వైపు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఓటీటీ రిలీజ్ విషయంలో ఓ 15 రోజులు లేదా ఓ నెల వెనక్కి వెళ్లారు అని చెబుతున్నారు. ఈ లెక్క జనవరి ఆఖరకు ఓటీటీలోకి సినిమా వస్తుంది.
మరోవైపు ‘పుష్ప: ది రూల్’ సినిమా ఓటీటీ వెర్షన్ రెడీ అయిపోయింది. 3 గంటల 20 నిమిషాల సినిమాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను ఓటీటీకి వచ్చేసరికి సుమారు నాలుగు గంటలు ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. అంతేకాదు ఆ వెర్షన్‌ను మరికొన్ని రోజుల తర్వాత అంటే ఓటీటీకి వచ్చేలోపే థియేటర్లలో కూడా చూడొచ్చు అని చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత భారీ విజయం అందుకున్న సినిమా అయినా నాలుగు వారాలకు ఓటీటీకి వచ్చేస్తోంది. ఆ లెక్కన జనవరి మొదటి వారంలో సినిమా ఓటీటీలో చూస్తాం అనుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు చూస్తే ఏకంగా ఎనిమిది వారాలు అంటున్నారు. అయితే ఇక్కడో విషయం ఉంది.. ఎనిమిది వారాలు అనేది సినిమా నిర్మాతలు గతంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం. మరి అందుకో లేక రూ. 2000 కోట్ల కోసమో కానీ ఓటీటీ విడుదల అయితే ఆగింది.