ఆర్.నారాయణమూర్తి ఏం మాట్లాడినా అది సంచలనమే. ఆయన చేసిన సినిమాల్లో మాదిరి బయట కూడా విప్లవాత్మకంగా ప్రసంగించడం ఆయన నైజం. ఒకప్పటి డాన్స్ మాస్టర్, తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు హైదరాబాద్, మణికొండ సమీపంలో ఉన్న టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం ముందు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.నారాయణ మూర్తి (R Narayana Murthy) తెలుగు ఫిలిం మేకర్స్ కి చురకలు అంటించారు.
ఆర్.నారాయణ మూర్తి (R Narayana Murthy) మాట్లాడుతూ… “కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కు రాజు మాస్టర్ ముందుండేవారు. ఈ సందర్భంగా శిరస్సు వంచి ఆయనకి నమస్కారం చేస్తున్నా. తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాలను తలదన్నే స్థాయికి వెళ్ళింది అంటే అది ఇలాంటి మహానుభావుల వల్లే అని చెప్పాలి. 1991లోనే ఆయన డ్యాన్సర్స్ అసోసియేషన్ ను స్థాపించారు. ఆ తర్వాత మరికొన్ని యూనియన్లు వచ్చాయి.అయితే ఒకటి చెప్పాలి. ఈరోజున తెలుగు సినిమా స్థాయి పాన్ ఇండియా రేంజుకి వెళ్ళింది.
కానీ తెలుగు ఫిలిం మేకర్స్… ఆ స్థాయికి వెళ్ళలేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాల కోసం వేరే భాషలకు చెందిన టెక్నిషియన్లని తీసుకుంటున్నారు. మన దగ్గర ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు కదా. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు, తెలుగు సినిమా మేకర్స్ వైపు చూస్తుంటే… మన వాళ్ళు మాత్రం వేరే భాషలకు చెందిన టెక్నీషియన్లను తీసుకోవడం..
వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం బాధాకరం. అందుకే సినీ కార్మికులు ఇంకా పేదవారిగానే ఉండిపోతున్నారు. చిత్రపురి కాలనీలో ఇప్పటికీ సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పెద్దలు వారి బాధను గుర్తించి వాళ్ళకి పక్కా ఇళ్ళు కట్టించి ఇవ్వాలని కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలని మనవి చేసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.