రమ్యకృష్ణ.. ఈ పేరు అనగానే మనకి ‘బాహుబలి’ లో శివగామి.. ‘నరసింహా’ సినిమాలో నీలాంబరి పాత్రలే కళ్ళ ముందు తిరుగుతాయి అనడంలో సందేహం లేదు. అలాంటి రమ్యకృష్ణ ఇప్పుడు వరుస సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ చాలా బిజీగా గడుపుతుంది. ఈమె నటన గురించి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్ హీరోలందరి సరసన ఈమె నటించింది. తమిళంలో ఈమె స్టార్ హీరోయిన్ గా రాణించింది. అయితే టాలీవుడ్ లో మొదట ఈమెకు ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర ఉండేదట. ఈ విషయాన్ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారు ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. “రమ్యకృష్ణ పై అప్పట్లో ఐరన్ లెగ్ ముద్ర పడింది. ఆ టైములో వాళ్ళ పేరెంట్స్ నా దగ్గర చాలా బాధపడ్డారు. అలాంటి టైములో ‘అల్లుడు గారు’ సినిమాలో రమ్యకృష్ణకి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమాలోని ‘ముద్దబంతి నవ్వులో’ అనే ఒకే ఒక్క పాటతో రమ్యకృష్ణ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత ‘అల్లరి మొగుడు’ సినిమాలో కూడా ఆమెకి ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా ఫంక్షన్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది. తనకి ఉన్న ‘ఐరన్ లెగ్’ అనే ముద్రను నేను తుడిచేశానంటూ ఆమె కంటతడి పెట్టుకుంది. ‘ఎవరైతే నిన్ను ఐరన్ లెగ్ అంటున్నారో వాళ్ళంతా నీ డేట్స్ కోసం వెయిట్ చేసే రోజొకటి వస్తుందని’ నేను రమ్యకృష్ణకి ముందుగానే చెప్పాను. అలా అన్నట్టుగానే ఆ తరువాత ఆమె స్టార్ హీరోయిన్ గా బిజీ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చారు.