‘బాహుబలి’ సినిమా అన్నేళ్లు తీసినా.. లీకులు పెద్దగా బయటకు రాలేదు అంటే కారణాలేంటి? అని చూస్తే ఒకటి రాజమౌళి ప్లానింగ్, రెండోది తక్కువమందితో సినిమాలో కొన్ని సీన్ల షూటింగ్, మూడోది అందరికీ అందుబాటులో లేకుండా రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేయడం అని చెబుతారు. వీటి వల్లే ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అనే మేటర్ బయటకు లీక్ అవ్వలేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు రాజమౌళి ఈ మూడింటి కాంబినేషన్‌ని మరోసారి ప్లాన్ చేశారు అని సమాచారం.
‘బాహుబలి’ సినిమాల తర్వాత రాజమౌళి ‘ఆర్ఆర్‌ఆర్’ అనే సినిమా చేశారు. ఆ సినిమా కోసం అయితే విదేశాలకు వెళ్లారు. లేదంటే నగరంలో కొన్ని భారీ సెట్లు వేశారు. ఇంకా లేదంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్ వేసి సినిమా పూర్తి చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పెద్దగా అడుగుపెట్టింది లేదు. సినిమా చిత్రీకరణ ఆఖరులో కొన్ని ప్యాచ్ వర్క్‌లు అక్కడ చేశారు అని సమాచారం. ఇప్పుడు SSRMB / SSMB29 కోసం మళ్లీ ఆయన రామోజీ ఫిలింసిటీలో అడుగపెట్టారు అని సమాచారం.
ఇటీవల కెన్యాలో ఓ షెడ్యూల్ షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన టీమ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టిందని తెలుస్తోంది. అక్టోబరు 10 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది అని సమాచారం. ఇందులో సినిమా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. సినిమా కోసం వేసిన సెట్స్‌లోకి చాలా తక్కువ మందినే అలౌ చేస్తున్నారని సమాచారం. అంటే సినిమాలోకి కీలక ట్విస్ట్, ప్లాట్‌కు సంబంధించిన షూటింగ్ అవుతోంది అని ఎక్సెపెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు.
ఈ సినిమాకు సంబంధించి లుక్‌లు కొన్ని, వీడియోలు కొన్ని ఈ మధ్య లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్త పడ్డారట సినిమా టీమ్. అలాంటి పరిస్థితి తలెత్తకుండా షూటింగ్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లుక్ మొన్నీమధ్య రిలీజ్ చేశారు. నవంబరులో సినిమా టీజర్/ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని తెలిపింది.