Ram Charan: ‘యూవీ’ వాళ్ళ ముందు చూపు బానే ఉంది..!
- April 24, 2025 / 12:02 PM ISTByPhani Kumar
మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) కెరీర్లో ఊహించని విధంగా ఓ గ్యాప్ వచ్చింది. కోవిడ్ వల్ల అందరి కెరీర్లోనూ గ్యాప్ వచ్చినప్పటికీ రాంచరణ్ సంగతి వేరు. 2019 లో ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) వచ్చింది. ఆ తర్వాత 3 ఏళ్ళ వరకు సినిమా లేదు.2022 లో ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) వచ్చింది. మళ్ళీ ‘గేమ్ ఛేంజర్’ కి (Game changer) 3 ఏళ్ళు వరకు పట్టింది. 2025 అదే ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు వెంటనే ‘పెద్ది’ (Peddi) మొదలుపెట్టాడు.
Ram Charan

బుచ్చిబాబు (Buchi Babu Sana) శరవేగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా స్టార్ట్ అయిన కొద్ది రోజులకే గ్లింప్స్ కూడా వచ్చేసింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డిసెంబర్ టైంకి ‘పెద్ది’ షూటింగ్ కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంది. రాంచరణ్ పోర్షన్ ఇంకా ముందే కంప్లీట్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఇంకో సినిమా చేయాలని చూస్తున్నాడు.

ఆల్రెడీ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తన 17వ సినిమా ఉంటుందని ప్రకటించడం జరిగింది. కానీ సుకుమార్ వద్ద ఇప్పుడు బౌండ్ స్క్రిప్ట్ రెడీగా లేదు. రాంచరణ్ తో చేయాలనుకున్న కథపై ఏడాదికి పైగా వర్క్ చేయాలి. సుకుమార్ ఒక పట్టాన దేనికి ఫిక్స్ అయ్యే రకం కాదు. ‘పుష్ప’ కి (Pushpa) ముందు మహేష్ బాబుతో (Mahesh Babu) చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా ఇందుకే ఆగిపోయింది. అయినా సుకుమార్ కు మంచే జరిగింది అనుకోండి.

అది వేరే విషయం. ఇప్పుడు చరణ్ సినిమా కోసం కూడా సుకుమార్ ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. అందుకే చరణ్ వేరే ఆప్షన్ కోసం చూస్తున్నాడు. తన స్నేహితులైన ‘యూవీ క్రియేషన్స్’ వారితో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాడు. అందుకోసం కథల అన్వేషణలో యూవీ టీం ఉన్నట్టు సమాచారం. ఇదే నిర్మాణంలో చరణ్ తండ్రి చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

















