ప్రఖ్యాత ఎన్.డి.టీవీ వారు నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ ‘ట్రూ లెజెండ్’ అవార్డుని మెగా పవర్ స్టార్ రాంచరణ్ దక్కించుకున్నారు. ఈ అవార్డు వేడుకలో రాంచరణ్ ఎంతో వినయంతో వ్యవహరించాడు. అతను మాట్లాడుతున్నప్పుడు కుర్చీ వేయబోతుంటే.. ‘లేదు నేను నిలబడగలను’ అంటూ చెప్పడం ఎంతో మందిలో అతను ఆత్మవిశ్వాసం నింపినట్టు అయ్యింది. అవార్డు తీసుకున్న అనంతరం రాంచరణ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభమవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అన్న విషయాన్ని ఈ అవార్డు వేదికగా చెప్పుకొచ్చాడు.
రాంచరణ్ మాట్లాడుతూ.. “ఏ గొప్ప పనైనా ప్రారంభించడం వెనుక ఓ బాధని(పెయిన్) అనుభవించడం జరుగుతుంది. 1997లో మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు.. సకాలంలో రక్తం లభించకపోవడంతో మరణించారు. 20వ శతాబ్దంలో కూడా రక్తం లభించకుండా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఏంటి? అని మా కుటుంబమంతా ఎంతో మనోవేదనకు గురైంది. ఆ ఘటనతో నాన్నగారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన పై అభిమానుల చూపించే ప్రేమాభిమానాల వల్ల 1998లో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించగలిగారు.
ఎవరైనా ఆయనతో ఫోటో దిగాలంటే .. ఈ సమాజం కోసం రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి రక్తదానం చేసిన ప్రతి అభిమానితో ఆయన ఫోటో దిగే కార్యక్రమాన్ని చేపట్టారు” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. అలాగే ‘కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. అలా 75 వేల మందిని రక్షించగలిగాం’ అంటూ కూడా చరణ్ చెప్పుకొచ్చాడు. నేను ప్రతి సినిమా ఫంక్షన్ లో నా తండ్రి గొప్పతనం గురించి చెప్పుకోవాలని ఉంటుంది.
కానీ నెపోటిజం లా కొంతమంది ఫీలవుతారు అని చెప్పుకోలేను. క్రిటిక్స్ ఎలా ఫీలైనా సరే.. తల్లిదండ్రుల గొప్పతనాన్ని పిల్లలు బహిరంగంగా చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఇది వాళ్ళు గ్రహించాలి… అంటూ కూడా రాంచరణ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను అందుకున్న ఈ అవార్డుని తన తండ్రికి డెడికేట్ చేస్తున్నట్టు కూడా చరణ్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.