ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరొక హీరో సినిమా చేయడం సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ప్రతి హీరో కెరీర్ లో అలాంటి సందర్భందాలు ఎన్నో జరుగుతుంటాయి. అలానే గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఛీ కొట్టిన కథతో మాస్ మహారాజా రవితేజ సినిమా చేయడమే కాదు.. బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టాడు. ఇంతకీ బన్నీ, ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఈ సినిమా మరేదో కాదు భద్ర.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో (Ravi Teja) రవితేజ, మీరా జాస్మిన్ జంటగా నటించారు. ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ, ఝాన్సీ, మురళీమోహన్, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. 2005లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అయితే బోయపాటి శ్రీను మొదట భద్ర కథను అల్లు అరవింద్, అల్లు అర్జున్ లకు వినిపించారట. అయితే కథ నచ్చినప్పటికీ ఆ సమయంలో `ఆర్య` మూవీతో బిజీగా ఉండటం వల్ల అల్లు అర్జున్ భద్రను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత దిల్ రాజు వద్దకు ఈ మూవీ వెళ్లిందట. దిల్ రాజు ప్రభాస్ తో తీస్తే ఈ సినిమా బాగుంటుందని బోయపాటి శ్రీనుకు చెప్పారట.
దాంతో ఇద్దరూ కలిసి వెళ్లి ప్రభాస్ కు కథ వినిపించారట. అయితే ప్రభాస్ సైతం చక్రం మూవీ చేస్తున్నాను.. డేట్స్ ఖాళీ లేవని చెప్పాడట. ఫైనల్ గా భద్ర స్టోరీ రవితేజ చెంతకు చేరింది. రవితేజకు కథ నచ్చడంతో.. వెంటనే సినిమాను పట్టాలెక్కించారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషకంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.