మాస్ మహారాజా ‘ధమాకా’ సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ తో రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ కలెక్షన్స్ పై ట్రేడ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ గా వచ్చింది కాబట్టి దీన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో భారీ వసూళ్లను సాధించింది ‘ధమాకా’. అటు ఏ సెంటర్స్ లో కూడా బాగానే ఆడుతోంది.
ఈ సినిమాకి పోటీగా మరో సినిమా లేకపోవడం ‘ధమాకా’కి బాగా కలిసొచ్చింది. నిఖిల్ ’18 పేజెస్’ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. ‘ధమాకా’కి పోటీ ఇచ్చే స్థాయిలో అయితే లేదు. ‘ధమాకా’ సినిమా రిజల్ట్ చాలా విషయాలను నేర్పిస్తుంది. ఈ మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిందనే మాటలు ఎంతగా వినిపిస్తున్నా.. మాస్ పల్స్ ని క్యాచ్ చేయగలిగితే కథ, కథనాలు ఎంత రొటీన్ గా ఉన్నా.. కేవలం కొన్ని అంశాలతోనే బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలవొచ్చని నిరూపించింది ధమాకా.
ముఖ్యంగా ఒక సినిమా సక్సెస్ లో ఆడియో ఎంత కీలకపాత్ర పోషిస్తుందో మరోసారి తెలిసేలా చేసింది ఈ సినిమా. హీరోయిన్ ఛాయిస్ కూడా సినిమాపై ఎంతగా ప్రభావం చూపిస్తుందో అర్ధమైంది. ఈ సినిమా పోస్టర్స్ రిలీజైన కొత్తల్లో రవితేజ పక్కన ఇంత చిన్న అమ్మాయి ఎలా సూట్ అవుతుందా అని చాలా మంది అనుమానించారు. కానీ ఇప్పుడు ఆన్ స్క్రీన్ వారిద్దరి కెమిస్ట్రీను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఎలాంటి పోటీ లేకుండా సోలో రిలీజ్ ప్లాన్ చేసుకోవడం ‘ధమాకా’కు చాలా పెద్ద ప్లస్ అయింది. సోలో రిలీజ్ కాకుండా ఏ సంక్రాంతి సీజన్లోనో సినిమా వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. వంద కోట్ల కలెక్షన్స్ సాధ్యమయ్యేది కాదు. నిర్మాతల మార్కెటింగ్ స్ట్రాటజీలు కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. మరో నాలుగైదు రోజుల వరకు బాక్సాఫీస్ వద్ద ‘ధమాకా’ డామినేషన్ కనిపించడం ఖాయం. ఆ తరువాత సంక్రాంతి రిలీజెస్ ఉన్నాయి కాబట్టి ఇక ఈ సినిమా సైడ్ అయిపోతుంది.