క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్‌లకు భాషతో సంబంధం లేదు. వేరే భాషలో ఉన్నా చూసేస్తున్నారు ఈ రోజుల్లో. కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత వచ్చిన పరిస్థితి ఇది. దీనిని చూసిన ఓటీటీ సంస్థలు మంచి సినిమా, కాస్త జనాలు చూశారు, చూస్తారు అనుకోగానే డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ‘రేఖా చిత్రం’ (Rekhachithram ) అనే సినిమాను తీసుకొచ్చారు. ఇటీవల మలయాళ ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచింది ఈ సినిమా.
ఆసిఫ్ అలీ (Asif Ali), అనస్వర రాజన్ (Anaswara Rajan), మమ్ముట్టి (Mammootty), మనోజ్ కె జయన్ (Manoj K. Jayan) ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రమే ఈ ‘రేఖా చిత్రం2 (Rekhachithram ) . జోఫిన్ టి.చాకో దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 9న కేరళలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. రూ.9 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తే రూ.55 కోట్ల వరకు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో ఇతర భాషల్లోకి అందుబాటులోకి వస్తోంది. ఈ మేరకు సోనీ లివ్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
నిజానికి ఈ సినిమా గురించి జనవరి మొదటి వారం నుండి చర్చ జరుగుతూనే ఉంది. తెలుగులోకి ఎలా తీసుకొస్తారు అని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సోనీ లివ్ టీమ్.. సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇదొక మర్డర్ మిస్టరీ. దానిని ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు.
వివేక్ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) పోలీస్ ఆఫీసర్. జూదం ఆడి ఉద్యోగం నుండి సస్పెండ్ అవుతాడు. సస్పెన్షన్ పూర్తయ్యాక డ్యూటీలో చేరిన రోజే రాజేంద్రన్ (సిద్ధిఖీ) ఆత్మహత్య కేసు అప్పగిస్తారు. ఆ పనిలో ఉండగా 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసుతో ఈ కేసుకు సంబంధం ఉందని గుర్తిస్తాడు. మరోవైపు రేఖ (అనస్వర రాజన్) కనిపించకుండా పోతుంది. రాజేంద్రన్ ఆత్మహత్యకు, రేఖ కనిపించక పోవడానికి కారణాలేంటి? ఈ కేసు ఎలా పరిష్కరించారు అనేదే సినిమా కథ.