రేణుకాస్వామి హత్య కేసు సౌత్ ఇండియా అంతటా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హీరో దర్శన్ (Darshan) ప్రమేయం ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో దర్శన్ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శన్ అరెస్ట్ కాగా పరప్పన అగ్రహార జైలులో దర్శన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జైలు తిండి తినడం వల్ల దర్శన్ ఆరోగ్యం సైతం క్షీణిస్తోందని తెలుస్తోంది.
కన్నడ సీనియర్ హీరో వినోద్ రాజ్ తాజాగా దర్శన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వినోద్ రాజ్ రేణుకాస్వామి కుటుంబ సభ్యులను సైతం కలుసుకొని లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అయితే ఆ సమయంలో దర్శన్ గురించి రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో దర్శన్ విడుదలైన తర్వాత తమ ఇంటికి వస్తే భోజనం పెడతానని రేణుకాస్వామి తండ్రి అన్నారు.
తాము జంగమ సామాజిక వర్గానికి చెందిన వారమని తమలో అసూయ, ద్వేషం ఉండవని రేణుకాస్వామి తండ్రి పేర్కొన్నారు. చట్ట ప్రకారం తమకు న్యాయం కావాలని ఆయన వెల్లడించారు. దర్శన్ భార్య తన భర్త కోసం పోరాటం చేయడంలో ఎలాంటి తప్పు లేదని రేణుకాస్వామి తండ్రి పేర్కొన్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మి డిప్యూటీ సీఎం శివకుమార్ తో ఏం మాట్లాడారో తమకు అనవసరం అని కాశీనాథయ్య తెలిపారు.
దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ త్వరగా విడుదల కావాలని చండికా యాగం జరిపించారు. ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. దర్శన్ రిలీజ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శన్ ఒకవేళ విడుదలైనా అతని సినీ కెరీర్ మునుపటిలా ఉండకపోవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.