సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దారుణ ఘటన తెలంగాణ రాజకీయాల్లో కూడా సీరియస్ ఇష్యూగా మారింది. ఒక సామాన్య మహిళ ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరికొందరు గాయపడిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి క్లారిటీగా మాట్లాడారు.
Revanth Reddy
సినిమా థియేటర్లలో జరిగే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. “ప్రజల ప్రాణాలతో ఎవరికి చెలగాటమాడే హక్కు లేదు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండవు. నేను సీఎంగా ఉన్నంత కాలం వీటికి అనుమతి ఇవ్వను” అని కఠినంగా తెలియజేశారు.
ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి ఆంక్షలతో తాము నష్టపోతామని భావిస్తున్నారు. టికెట్ రేట్లను పెంచడం ద్వారా మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టుబడులు రాబట్టుకోవడం సాధ్యమని వారు వాదిస్తున్నారు. బెనిఫిట్ షోల ద్వారా ఫ్యాన్స్ కోసం ప్రత్యేక అనుభవం కల్పించడానికి ప్రయత్నించే నిర్మాతలు, హీరోల అభిమానులు కూడా ఈ ఆదేశాలతో నిరాశకు గురయ్యారు.
రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ, “సినిమా వాళ్లకు వెసులుబాటు ఉంది, కానీ అది ప్రజల ప్రాణాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఎవరైనా వ్యాపారం చేసుకోవడం సమస్య కాదు, కానీ సామాన్య ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి” అన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ఎవరైనా రేవంత్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక టికెట్ రేట్లు తగ్గించడంతో పెద్ద సినిమాల వసూళ్లపై నేరుగా ప్రభావం పడనుంది. ఇకపై నైజాంలో బెనిఫిట్ షో లు రద్దయితే రికార్డుల సృష్టి మరింత కష్టమవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో టాలీవుడ్ వ్యాపారంపై ఈ నిర్ణయం ఎంత ప్రభావం చూపుతుందో, మరి సినీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.