రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా లో ‘ఆర్జీవీ’. ఈయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా ఓ సంచలనమే…! అయితే ఏమాత్రం తడబడకుండా తను అనుకున్నది అనుకున్నట్టు చెప్పేస్తాడు. కొంతమందికి ఈ కామెంట్స్ నచ్చుతాయి.. మరికొందరికి ఈయన కామెంట్స్ కోపం తెప్పిస్తుంటాయి. అందుకే చాలా మంది ఈయన్ని తిట్టిపోస్తుంటారు. కానీ ఈ తిట్లను, కామెంట్లను ఏమాత్రం లెక్కచేయడు వర్మ. తనధైన శైలిలో దూసుకుపోతుంటాడు. మొన్నటివరకూ పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. తరువాత చంద్రబాబు నాయుడు వైపు యూటర్న్ తీసుకున్నాడు. అయితే అనుకోకుండా మహేష్ ఫ్యాన్స్ ను కూడా కామెంట్ చేసి.. వారి కోపానికి కూడా గురయ్యాడు.
విషయం ఏంటంటే.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రం హిట్టయ్యింది. రేపో.. మాపో బ్రేక్ ఈవెన్ కూడా సాధించడానికి రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం పై వర్మ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇటీవల ఓ ప్రెస్ మీట్ ని నిర్వహించాడు వర్మ. తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ‘మహర్షి’కి సంబంధించిన ప్రశ్నలు వర్మకు ఎదురయ్యాయి. వీటికి వర్మ స్పందిస్తూ… “నాకు గ్రామాలన్నా పంట పొలాల నేపథ్యంలో సినిమాలన్నా కూడా పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే నేను ఎప్పుడు కూడా రైతు ఆధారిత.. వ్యవసాయ ఆధారిత కథలను ఎంచుకోను. ప్రజలకు కూడా అలాంటి నేపథ్యం ఉన్న సినిమాలంటే నచ్చవు. ఎక్కువ శాతం ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలనే కోరుకుంటున్నారు.
ప్రేక్షకుడు కమర్షియల్ ఎలిమెంట్స్, పాటలు ఫైట్లు ఉన్న విషయాన్ని చూసి మాత్రమే సినిమాకు వెళ్తాడు. ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాలో ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి.. అందులోనూ మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి… ఆయన పై ఉన్న అభిమానంతో మాత్రమే సినిమాకి వస్తున్నారు. అంతేకాని ఇందులో రైతుల గురించి సందేశం బాగుందని ఎవరూ రావడం లేదు. ఒక వేళ ‘మహర్షి’ చిత్రంలో మహేష్ బాబు లేకాపోతే ఆ సినిమాని ఎవ్వరూ చూడరు” అంటూ కామెంట్ చేసాడు వర్మ.