జీవితంలో కొన్నాళ్లు దాటాక.. వెనక్కి తిరిగి చూసుకుంటే అయితే పొంగిపోవాలి, లేదంటే ఏం చేయాలి అనే విషయంలో స్ఫూర్తి కలగాలి అంటారు పెద్దలు. ఇప్పుడు తొలి రకం అనుభూతితో మనసు నిండిపోయి ఆనందంగా ఉన్నారు ప్రముఖ నటుడు, దర్శకుడు రిషభ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా తాజాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆయన తన పాత రోజులను గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘కాంతార: చాప్టర్ 1’ సినిమాను సుమారు 5000 స్క్రీన్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన తొలి సినిమా విడుదల నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. 2016లో తన డైరక్టర్ డెబ్యూ సినిమా ఒక్క షో ప్రదర్శించడం కోసం చాలా కష్టపడినట్లు రిషభ్ చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న తనకు దక్కుతున్న గౌరవం చూస్తుంటే ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాకు ఇప్పుడు థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని పోస్టులో పేర్కొన్నారు.
దర్శకుడిగా నా జర్నీలో దేవుడి దయతో పాటు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఉన్నాయి. మీ ఆదరణతోనే నాకీ విజయం సాధ్యమైంది. నన్ను ఆదరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని ఎమోషనల్‌గా రాసుకొచ్చారు రిషభ్. 2012లో ‘తుగ్లక్’ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు రిషబ్ శెట్టి. ఆ తర్వాత 2016లో ‘రిక్కీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. 2022లో స్వీయ దర్శకత్వంలో ‘కాంతార’ తెరకెక్కించారు. ఈ సినిమాకు జాతీయస్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చింది.
చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశంసలు, పురస్కాలు కూడా దక్కాయి. ఇప్పుడు దీని ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ తెరకెక్కించారు. ఈసారి బడ్జెట్ బాగానే పెరిగింది. అయితే అదేస్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటోంది. వసూళ్లు కూడా అదే స్థాయిలో భారీగానే ఉంటున్నాయి.