‘కథా సుధ’ పేరుతో ఈటీవీ విన్ ఓటీటీలో కొన్ని షార్ట్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనే సంగతి అందరికీ తెలిసిందే. వీటికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది కూడా. ఇందులో భాగంగా… ‘తను రాధే.. నేను మధు’ అనే షార్ట్ మూవీ రూపొందింది. దాదాపు 33 నిమిషాల నిడివి కలిగిన ఈ షార్ట్ మూవీ సెప్టెంబర్ 14 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆర్.పి.పట్నాయక్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
ఓ టైంలో తన మ్యూజిక్ తో ఆడియన్స్ ను అలరించారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టుకుని ‘తను రాధే.. నేను మధు’ని డైరెక్ట్ చేయడం విశేషం. ఇందులో లక్ష్మీ దుర్గ కత్తి, జయవంత్ పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఋషి కిరణ్, శ్రీధర్ భూమిరెడ్డి కూడా ముఖ్య పాత్రలు పోషించారు.విదేశాల్లో జరిగిన ఓ యదార్థ సంఘటనను ఆధారం చేసుకుని ఈ షార్ట్ మూవీని రూపొందించారు ఆర్.పి.
‘తను రాధే.. నేను మధు’కి సంబంధించి ఇంకో విశేషం ఏంటంటే… ఈ షార్ట్ మూవీతో స్టార్ యాంకర్ గీతా భగత్ నిర్మాతగా మారారు. బుల్లితెరపై కుకింగ్ వీడియోస్ హోస్ట్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఆమె ఇప్పటి వరకు కొన్ని వందల సినిమా ఈవెంట్లను, సెలబ్రిటీ ఇంటర్వ్యూలను హోస్ట్ చేసి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. రఘురాం బొలిశెట్టితో కలిసి ఆమె ‘తను రాధే.. నేను మధు’ని నిర్మించారు.దీని షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరిగింది.