రోడ్డు ప్రమాదంలో యువ కథానాయకుడు సాయితేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని వైద్యులు చెబుతున్నారు. అయితే మరోవైపు పోలీసులు సాయితేజ్ మీద కేసులు పెట్టారు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసులు పెట్టారు. అయితే ఈ వ్యవహారంపై ఉదయమే ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడవి వైరల్‌గా మారాయి. యాక్సిడెంట్ వ్యవహారంలో సాయి తేజ్‌పై పోలీసులు కేసులు నమోదు చేస్తారని ఉదయాన్నే వార్తలొచ్చాయి.
అదే సమయంలో ఆర్పీ పట్నాయక్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఆర్పీ పట్నాయక్. దాంతోపాటు యాక్సిడెంట్ కారణమైన రోడ్డు నిర్వహణ, తదితర అంశాల గురించి ప్రస్తావించారు. ఏకంగా వారిపై కూడా కేసులు పెట్టాలన్నారు. సాయి తేజ్ యాక్సిడెంట్ విషయంలో అతి వేగం కేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన నిర్మాణ సంస్థ మీద కేసు పెట్టాలి.
ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలి అని ఆర్పీ డిమాండ్ చేశారు. ఈ చర్యల వల్ల నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అభిప్రాయపడుతున్నాను అని ఎఫ్‌బీలో రాసుకొచ్చారాయన.