సంధ్య థియేటర్ ఘటన కేసులో కోర్టులు చుట్టూ తిరుగుతున్న ప్రముఖ హీరో అల్లు అర్జున్‌కు కోర్టులో మరో ఊరట లభించింది. తనకు వీక్లీ హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టు మెట్లు ఎక్కిన అల్లు అర్జున్‌కు అక్కడ ఊరట లభించింది. ప్రతి ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలనే నిబంధనను కోర్టు మినహాయించింది. అలాగే విదేశాలకు వెళ్లేందుకు కూడా అనుమతించింది.
‘పుష్ప: ది రూల్’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబరు 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ వచ్చినప్పుడు తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు అవ్వడం, కేసు విచారణ జరగడం, అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం, మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఆ తర్వాత పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వడం జరిగిపోయాయి.
అయితే భద్రతా కారణాల దృష్ట్యా తనకు వీక్లీ హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ నాంపల్లి కోర్టును కోరారు. దీని మీద విచారణ జరిపిన న్యాయస్థానం ఇకపై వారానికొకసారి పోలీసు స్టేషన్‌కి వచ్చి సంతకం పెట్టక్కర్లేదు అని తీర్పు ఇచ్చారు. దీంతో ఇకపై ప్రతి ఆదివారం బన్నీ పోలీస్ స్టేషన్‌కి రానక్కర్లేదు. అలాగే ‘పుష్ప: ది రూల్’ రిలీజ్ అయ్యాక విదేశాలకు వెళ్లే ఆలోచనలో బన్నీ ఉన్నాడట. అందుకే ఇప్పుడు పర్మిషన్ తీసుకొని విదేశాలకు వెళ్తున్నారట.
ఇక అల్లు అర్జున్ సినిమాల సంగతి చూస్తే.. లైనప్‌లో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశాడు. అదెప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు. ఆ సినిమా అయ్యాక సందీప్ రెడ్డి వంగా సినిమా ఉంటుంది అంటున్నారు. అది లేకపోతే అట్లీ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు.