స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్ట్రీమింగ్ యాప్ ఆహా లో విడుదలైన చిత్రం రన్. సినిమాలలో అడపాదడపా రోల్స్ చేస్తున్న నవదీప్ హీరోగా నటించగా వర్ధమాన నటి పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించింది. దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా క్రైమ్ అండ్ సస్పెన్సు థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా మరి ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం…
కథ: ఓ ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న సందీప్ (నవదీప్), శృతి(పూజిత పొన్నాడ) అందమైన జీవితం గడుపుతూ ఉంటారు. వీరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు నవదీప్ భార్య శృతి ఆత్మ హత్య చేసుకొని చనిపోతుంది.ఇది ఆత్మ హత్యకాదు మర్డర్ అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు శృతి భర్త సందీప్ ఆమెను చంపాడని అనుమానిస్తారు. పోలీసుల నుండి తప్పించుకున్న సందీప్ తన భార్యను హత్య చేసిన వారిని వెతకడం మొదలుపెడతాడు. ఇంతకీ శ్రుతిది ఆత్మ హత్యా లేక మర్దరా? మర్డర్ అయితే ఆమెను చంపింది ఎవరు..? సందీప్ నిజంగా అమాయకుడా? శృతిని సందీప్ చంపక పోతే చంపినవారిని పట్టుకున్నాడా? అనేదే రన్ మూవీ మిగతా స్టోరీ…
నటీనటుల పనితీరు: రెండు భిన్న షేడ్స్ లో సాగే అనుమానస్పద పాత్రలో నవదీప్ నటన మెప్పిస్తుంది. శృతి మర్డర్ విషయంలో ఎవరో తెలుసుకోవాలనే కసి అలాగే ఆ మర్డర్ చేసేసింది తానే అన్నట్లు సాగే అనుమానాస్పద పాత్రలో నవదీప్ చక్కగా నటించారు. సినిమా మొత్తం ఆయనపై సాగుతుంది.
హీరోయిన్ పూజిత పొన్నాడకు చెప్పుకో దగ్గ పాత్ర పరిధి లేదు. సినిమా ప్రారంభంలోనే ఆమె పాత్ర చచ్చిపోతుంది. ఐతే నవ్ దీప్ తో వచ్చే సన్నీవేశాలో ఆమె గ్లామరస్ గా కనిపించింది .
ఈ మూవీలో ఒకప్పటి హీరో వెంకట్ కీలకమైన పోలీస్ రోల్ చేశారు. చాలా కాలం తరువాత స్క్రీన్ పై కనిపించిన వెంకట్ పోలీస్ గా సాలిడ్ ఫిజిక్ తో పాత్రకు న్యాయం చేశారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ తో పాటు కథలో కీలక రోల్ చేసిన అమిత్ నటన మెప్పిస్తుంది. ఇక మిగతా పాత్రలు తమ పరిధిలో చక్కని నటన కనబరిచారు.
సాంకేతిక వర్గం పనితీరు: సాంగ్స్ పరవాలేదు కానీ బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఓ టి టి విడుదల నేపథ్యంలో వీటికి పెద్ద మార్కెట్ ఉండదు, అలాగే స్టార్ క్యాస్ట్ కూడా లేరు, దీనితో నిర్మాణ విలువలు పరవాలేదు అన్నట్లుగా ఉన్నాయి. కెమెరా పనితనం అలాగే ఎడిటింగ్ కొంత మేర ఆకట్టుకున్నాయి.
ఇక దర్శకుడు గురించి చెప్పాలంటే శృతి హత్యకు కారణం ఎవరు అనే సస్పెన్సు మినహా దాని చుట్టూ నడిచే కథనంలో ఎటువంటి ఆసక్తి లేకుండా నడిపించారు.
విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్ తెరపై పండాలంటే పట్టుసడలని, వేగంగా సాగే స్క్రీన్ ప్లే అవసరం. రన్ మూవీలో అవేమి మనకు కనిపించవు. తన భార్య హత్య వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో హీరో సాగించే ప్రైవేట్ ఇన్వేస్టిగేషన్, ఆ క్రమంలో జరిగే హత్యలు ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని ఇవ్వలేక పోయాయి. పెద్దగా లాజిక్ లేకుండా వచ్చే సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని పాత్రలు కథలో భాగంగా అనిపించవు. ఈ సస్పెన్సు థ్రిల్లర్ కి దర్శకుడు ఇచ్చిన ముగింపు కూడా అంత ఆకర్షిణీయంగా లేదు.
కథ ప్రారంభంలోనే హీరోయిన్ పూజిత పాత్ర చనిపోతుంది. దీనితో మూవీకి గ్లామర్ యాంగిల్ కూడా మిస్ అయ్యింది. ఓ టి టి ప్లాట్ ఫార్మ్ వలనేమో చాలా తక్కువ నిడివితో మూవీ తెరకెక్కించారు. నవదీప్ నటన మరియు అక్కడక్కడకా మెప్పించే ట్విస్ట్స్ రన్ మూవీలో మెప్పించే అంశాలు. ట్రైలర్ చూసి ఓ గొప్ప సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ చూడబోతున్నాం అనుకుంటే ఆశాభంగం తప్పదు.