గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు చేయని సమంత (Samantha) .. వెబ్ సిరీస్ రూపంలో వస్తుండటంతో ‘సిటడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny) మీద భారీ అంచనాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ‘భారీ’ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుండి స్ట్రీమ్ అవుతుంది. భారీ ఎందుకన్నారు కాస్టింగ్ వల్లనా అని అనుకుంటున్నారా? ఎందుకు అలా అన్నామో వార్త ఆఖరున మీకే అర్థమవుతుంది. ఈ సిరీస్‌లో సమంతతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) కూడా నటించాడు.
Citadel Honey Bunny
బాలీవుడ్‌లో స్థిరపడ్డ తెలుగు దర్శకద్వయం రాజ్ – డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. అలాంటి ఈ ఆసక్తికరమైన వెబ్ సిరీస్ గురించి కొన్ని రోజులుగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఎపిసోడ్స్ ఎన్ని? రన్ టైమ్ ఎంత? లాంటి వివరాల విషయంలో పుకార్లు బాగానే షికారు చూన్నాయి. వాటి ప్రకారం చూస్తే.. ఈ వెబ్ సిరీస్‌లో మొత్తంగా ఆరు ఎపిసోడ్లు ఉంటాయి అని అంటున్నారు. ఒక్కో ఎపిసోడ్ సుమారు 50 నిమిషాల నిడివితో ఉంటుందట.
దీంతో ఈ సిరీస్ చూడాలి అంటే రెండు సినిమాలు చూసినంత సమయం పడుతుంది అని అంటున్నారు. మరికొందరైతే సిరీస్ చూడాలంటే తెల్లూర్లూ మొబైల్ / సిస్టమ్ / టీవీ దగ్గర ఉండాల్సిందే అంటూ చమత్కరిస్తున్నారు. అయితే రాజ్ – డీకే సిరీస్‌లు కట్టిపడేసే స్క్రీన్‌ప్లేతో సిద్ధం చేస్తారు. కాబట్టి అంతసేపు ఉన్నా చూసేయొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ కథ సంగతి చూస్తే.. హనీ (సమంత) ఓ జూనియర్ ఆర్టిస్ట్. అవకాశాల కోసం సినిమా ఆఫీసులకు వెళ్లి ఆడిషన్స్ ఇస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో స్టంట్ మన్ బన్నీ (వరుణ్ ధావన్) పరిచయం అవుతాడు. బన్నీతో పరిచయం హానీ ప్రయాణాన్ని ఎలా మార్చింది. జూనియర్ ఆర్టిస్ట్ అయిన హనీ స్పై ఏజెంట్‌గా ఎలా మారింది. ఏజెంట్ అయ్యాక ఏం జరిగింది అనేదే కథ. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో ఈ రంగంలోనూ విజయం అందుకున్న సామ్.. ఈ సిరీస్‌తో ఇంకెంత పేరు తెచ్చుకుంటుందో చూడాలి.