కరోనా తొలి వేవ్ తర్వాత టాలీవుడ్‌కి బూస్టింగ్ ఇచ్చిన సినిమా ‘క్రాక్’ అనే చెప్పాలి. ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతోనే మిగిలిన హీరోలు ముందుకొచ్చారు. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత అలాంటి విజయం అందుకున్న సినిమా ‘సీటీమార్’ అంటున్నారు పరిశీలకులు. అయితే ఈ సినిమాకు ముందు దర్శకుడు ఈ కథ అనుకోలేదట. గోపీచంద్‌తో వేరే జోనర్‌లో సినిమా చేయాలని భావించారట. కానీ తర్వాత మారిందట. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపీచంద్‌తో మరో యాక్షన్ బేస్డ్ మాస్ సినిమా చేయాలని సంపత్ నంది అనుకున్నారట.
ఓ పల్లెటూరి నేపథ్యంలో… విద్యకి సంబంధించిన అంశంతో ఓ కథ కూడా అనుకున్నారట. ఇక ఆ కథ మీద కూర్చుని ఫైనల్ చేద్దాం అనుకునేలోగా… మళ్లీ మనసు మార్చుకున్నారట. కబడ్డీ లాంటి ఓ క్రీడకి, మరిన్ని మాస్ అంశాల్ని జోడిస్తూ ‘సీటీమార్’ కథ రాసుకున్నారట సంపత్ నంది టీమ్.మహిళా సాధికారిత అనే కీలక అంశాన్ని స్పృశిస్తూ ఓ మాస్ కథని చెప్పే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది.
అలా పుట్టిందే ‘సీటీమార్’ అని సంపత్ నంది చెప్పుకొచ్చారు. ‘ఏమైందీ వేళ’తో దర్శకుడిగా ప్రయాణం మొదలెట్టిన సంపత్ నంది ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ లాంటి మంచి మాస్ సినిమాలు చేశాడు. ఇప్పుడు మళ్లీ ‘సీటీమార్’తో మరోసారి తన మార్క్ చూపించాడు.