సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు వర్సెస్ చిన్న సినిమాలు అనేది ఎప్పుడూ ఉండేదే. కానీ ఈసారి యుద్ధం కంటెంట్ మీద కంటే ‘టికెట్ రేటు’ మీద నడుస్తోంది. ప్రభాస్, చిరంజీవి సినిమాలు భారీ బడ్జెట్ కాబట్టి రేట్లు పెంచక తప్పని పరిస్థితి. కానీ రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి మాత్రం పాత రేట్లకే తమ సినిమాలను చూపించడానికి రెడీ అయ్యారు.
అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాలు భారీ బడ్జెట్ తో వస్తున్నాయి. వీటికి టికెట్ రేట్లు పెంచితేనే గిట్టుబాటు అవుతుంది. కానీ రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు మాత్రం రెగ్యులర్ టికెట్ రేట్లకే రాబోతున్నాయి.
పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. ఒక ఫ్యామిలీ వెళ్లాలంటే పెద్ద సినిమాలకు వేల రూపాయలు అవుతాయి. అదే ఈ మూడు చిన్న సినిమాలకు రేట్లు తక్కువ ఉంటే, ఆ భారం తగ్గుతుంది. బడ్జెట్ రికవరీ కోసం పెద్దోళ్లు రేట్లు పెంచితే, అసలుకే ఎసరు వచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో కామెడీ ఎంటర్టైనర్లుగా వస్తున్న ఈ మిడ్ రేంజ్ సినిమాలకు ఇది పెద్ద ప్లస్ పాయింట్.
సినిమా ఏ మాత్రం బాగున్నా, తక్కువ రేటు ఉంది కదా అని జనం ఎగబడి చూస్తారు. పెద్ద సినిమాల ఓవర్ కాన్ఫిడెన్స్ ని, ఈ మూడు సినిమాలు తమ ‘అందుబాటు ధరల’తో దెబ్బకొట్టేలా ఉన్నాయి. టికెట్ రేటు తగ్గించి సామాన్యుడికి దగ్గరవ్వాలనే ఈ స్ట్రాటజీ వర్కవుట్ అయితే మాత్రం, సంక్రాంతికి అసలైన విన్నర్లు వీళ్ళే అవుతారు.
