హిట్ సినిమాను ఇతర భాషల్లోకి తీసుకెళ్లడం కొత్త విషయమేమీ కాదు. అందులోనూ బ్లాక్‌బస్టర్ కొట్టిన సినిమాలకు ఇది మరీ కామన్. అలా ఈ సంక్రాంతికి వచ్చి రూ.300 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాలీవుడ్‌కి వెళ్లడానికి సిద్ధమవుతోంది. ‘మకర్ సంక్రాంతికో హమ్ ఆరహీహూమ్’ అంటూ బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఇక్కడి నిర్మాత దిల్ రాజునే నిర్మిస్తారని.. ఓ బాలీవుడ్ హీరోకు చెందిన నిర్మాణ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంటుంది అని సమాచారం.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ హక్కులు కొనుగోలు చేయాలని ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్లాన్ చేసినా.. దిల్ రాజు తానే నిర్మిస్తానని చెప్పారట. దీంతో రీమేక్ చేసే హిందీ టీమ్ హైదరాబాద్ వచ్చి దర్శకుడు అనిల్ రావిపూడి సలహాలు, సూచనలు తెలుసుకుందట. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే అక్షయ్ కుమార్‌తో చర్చలు జరిగాయని, దాదాపు అతనే ఓకే అవుతాడని సమాచారం. ఫ్యామిలీ టచ్ ఉన్న హీరో కావడంతో అక్కడ ఈ సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడతాయి అని చెప్పొచ్చు.
ఇప్పటికే బాలీవుడ్‌లో ‘జెర్సీ’, ‘హిట్’ సినిమాలు చేసిన దిల్ రాజు చాలా ఏళ్లుగా మూడో సినిమాను ఓకే చేసుకునే పనిలో ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ హీరోగా ఓ సినిమా ఓకే చేసుకున్నారు. అయితే ఎక్కడో చిన్న చిక్కుముడి పడి ఆ సినిమా ముందుకు వెళ్లడం లేదు. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్‌ను తీసుకెళ్లే ఆలోచనలు చేస్తున్నారు. మరి ఈ రెండింటిలో అతని మూడో సినిమా ఏదవుతుంది అనేది చూడాలి. ఇక్కడ విజయాల శాతం ఎక్కువగానే ఉన్న దిల్ రాజుకు బాలీవుడ్‌లో సరైన విజయం పడలేదు. మరి ఈ మూడో సినిమా అయినా విజయం అందిస్తుందేమో చూడాలి.