తెలుగులో “యుగానికి ఒక్కడు” సినిమాకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్తీ (Karthi) హీరోగా, సెల్వరాఘవన్ (Selvaraghavan) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లింది. కోలీవుడ్ కంటే టాలీవుడ్‌లో బిగ్గర్ హిట్ సాధించిన ఈ మూవీ, కార్తీకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. పీరియాడిక్ డ్రామాగా ఉన్న ఈ కథ, తెలుగువారికి అందుబాటులోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది. “యుగానికి ఒక్కడు”కి (Yuganiki Okkadu) సీక్వెల్ ఉంటుందని సెల్వరాఘవన్ ఇప్పటికే ప్రకటించారు.
Yuganiki Okkadu
అయితే ఈ సీక్వెల్‌లో కార్తీ స్థానంలో ధనుష్ నటించనున్నారని తెలిపారు. చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో, సినిమాను రద్దు చేశారేమో అనుకుని అభిమానులు నిరాశ చెందారు. కానీ తాజాగా డైరెక్టర్ సెల్వరాఘవన్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా చేయడంపై తమ నిబద్ధత మారలేదని, కానీ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం అవసరమని తెలిపారు.
సెల్వరాఘవన్ చెప్పిన వివరాల ప్రకారం, ఈ సీక్వెల్‌లో మొదటి భాగం కంటే మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని చెప్పారు. కేవలం పాత్రల ఎంపిక కోసం కూడా చాలా శ్రద్ధ వహించాల్సి వస్తుందని అన్నారు. “మొదటి భాగంలో మించిన కొత్త పాత్రలు, మరింత డీప్ కథాంశం ఉంటాయి. వాటికి న్యాయం చేసే నటీనటుల ఎంపిక చాలా కీలకం,” అని ఆయన వెల్లడించారు. ఈ సినిమాను కిక్ స్టార్ట్ చేసేందుకు ధనుష్ (Dhanush) తదుపరి ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉంటుందని వివరించారు.
ధనుష్ ప్రస్తుతం మరొక సీక్వెల్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక “యుగానికి ఒక్కడు 2″పై పూర్తి స్థాయిలో పని మొదలవుతుందని సెల్వరాఘవన్ తెలిపారు. ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడం ఖాయమని, దానికి తగ్గట్టే గ్రాండ్‌గా రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో సినిమా అటు తమిళ ప్రేక్షకులు, ఇటు తెలుగు ఆడియన్స్ మధ్య మంచి హైప్ తెచ్చుకుంది.