భారతదేశంలో మహిళా నటీమణుల్లో రిచేస్ట్ ఎవరు అని అడిగితే అంత ఈజీగా ఎవరు చెప్పలేరు. నేటి తరం టాప్ హీరోయిన్లు, బాలీవుడ్ బిగ్ సెలబ్రిటీలు లేదా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లు ఉండవచ్చు. అయితే అంచనాలు తప్పిస్తే ఈ రేసులో ముందు నిలిచిందో అందమైన సీనియర్ నటి. ఆమె మరెవరో కాదు, గ్లామర్ క్వీన్ జూహీ చావ్లా (Juhi Chawla) . హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం, జూహీ చావ్లా ప్రస్తుతం భారత్‌లో అత్యంత సంపన్న కధానాయికగా రికార్డుకెక్కారు.
ఆమె సంపద విలువ దాదాపు రూ. 4600 కోట్లుగా ఉంది. ఇంతకుముందు అగ్ర స్థానంలో ఉన్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) లాంటి ప్రముఖులను దాటేసింది అంటే జూహీ స్టామినా ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. 90వ దశకంలో జూహీ చావ్లా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి, బోల్ రాధా బోల్, డర్, ఇష్క్ లాంటి సూపర్ హిట్లతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఈ మధ్య కాలంలో తెరపై ఆమె ఎక్కువగా కనిపించలేదు.
ఎక్కువగా నిర్మాతగానే ఉండిపోయారు. ఆమె షారుఖ్ ఖాన్‌తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ సహ-వ్యవస్థాపకురాలు, అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ క్రికెట్ జట్టులో కూడా వాటా కలిగి ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు జూహీని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాయి. వాణిజ్యంగా విజయవంతమైన చిత్రాల నిర్మాణం, కేకేఆర్ క్రికెట్ జట్టు లాభాలు ఆమె ఆర్థిక స్థితిని మునుపటిలా మెరుగుపరిచాయి.
సినిమాలు లేకపోయినా, ఈ రెండు ప్రధాన వ్యాపారాలతో ఆమె సంపన్నత ఇంకా కొనసాగుతోంది. మొత్తానికి జూహీ చావ్లా ఆస్తి ఇతర టాప్ నటీమణులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఐశ్వర్య రాయ్ రూ. 900 కోట్లు, ప్రియాంక చోప్రా రూ. 650 కోట్ల నికర విలువతో అగ్ర జాబితాలో ఉన్నా, ఆ స్థాయిని అధిగమించిన జూహీ (Juhi Chawla) ఇంకా నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.