బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో రీమేక్‌ల తాకిడి పెరుగుతోంది. అక్కడి జనాలు వరుస పెట్టి సౌత్ సినిమాలకు రీమేక్‌లు చేస్తున్నారు. ఫలితాల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ ఎందుకో కానీ అక్కడి వాళ్లు సౌత్ సినిమాల రీమేక్‌లు ఆపడం లేదు. తాజాగా మరో సౌత్ సినిమా ఇలానే రీమేక్ రూపంలో రాబోతోందా? ఓ సినిమా ట్రైలర్‌ని చూస్తే అలానే అనిపిస్తోంది. ఆ సినిమానే ‘దేవా’ (Deva). షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా తెరకెక్కిన చిత్రమిది.
Shahid Kapoor
ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి చూస్తే.. అర్జెంట్‌గా ఓ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వాలి. లేకపోతే ఇప్పట్లో ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) వైబ్ తగ్గేలా లేదు. ‘బేబీ జాన్’ (Baby John) సినిమాతో హిట్ కొడదామని వరుణ్ ధావన్ (Varun Dhawan ) చూసినా అనుకున్న పని అవ్వలేదు. ఇప్పుడు ‘దేవా’గా జనవరి 31న షాహిద్ కపూర్ రాబోతున్నాడు. ఈ సినిమాకు విజయం పక్కాగా రావాలని అక్కడి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ మళ్లీ పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు.
‘దేవా’ సినిమా ట్రైలర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ఓ మలయాళీ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ముంబై పోలీస్’ సినిమానే ఇప్పుడు రీమేక్ అని అంటున్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఓ పోలీస్ ఆఫీసర్ హత్య జరగడం, ఆ కేసుని ఛేదించేందుకు హీరో రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏమైంది అనేదే సినిమా కథ.
మరి ఈ సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. సినిమా కథ, కాన్సెప్ట్ బాలీవుడ్‌కి బాగా దగ్గరగా ఉంది అని అంటున్నారు. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ సరైన ఫలితం అందుకోలేకపోయింది. ‘హంట్’ (Hunt) పేరుతో ఆ సినిమాను సుధీర్‌బాబు (Sudheer Babu) రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ ఆడని సినిమా బాలీవుడ్‌లో ఆడుతుందేమో చూడాలి. అన్నిటికంటే ముందు అసలు ఈ సినిమా రీమేకా కాదా అనేది చూడాలి.