‘మన శంకర్‌వరప్రసాద్ గారు’ సినిమా టీమ్ ప్రచారం విషయంలో చాలా కొత్తగా ముందుకెళ్తోంది. మొన్నీమధ్యే సింగర్ ఉదిత్ నారాయణ్‌కు వెల్‌కమ్ బ్యాక్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతకుముందు సినిమా ఓపెనింగ్ సమయంలో చిరంజీవితో ఓ స్పెషల్ వీడియో రూపొందించారు. హీరోయిన్‌గా నయనతార సినిమా సెట్స్‌లోకి వస్తున్నట్లుగా మరో ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేశారు. ఇలా చేస్తున్నారు, నటులు, సాంకేతిక నిపుణులు చెబుతున్నారు కానీ.. కీలకమైన ఓ విషయం మాత్రం ఇన్నాళ్లుగా చెప్పడం లేదు. ఆయన చిరంజీవి ప్రత్యర్థి.
‘మన శంకర్‌వరప్రసాద్ గారు’ సినిమాలో విలన్ ఎవరు అనే విషయంలో ఇప్పటివరకు సినిమా టీమ్ నుండి ఎలాంటి స్పందన లేదు. దీంతో చిరంజీవి ప్రత్యర్థి ఎవరు చర్చ మొదలైంది. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి టీమ్ దగ్గరకు వెళ్లినట్లు ఉంది. అందుకే సినిమాలో విలన్ ఎవరు అనే విషయాన్ని ఓ స్పెషల్ వీడియోలో అనౌన్స్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన రీసెంట్‌గానే సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు అని సమాచారం. ఆయనే మలయాళ నటుడు సైన్ టామ్ చాకో.
నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సైన్ టామ్ చాకో. ఆ తర్వాత నాగశౌర్య ‘రంగబలి’, ఎన్టీఆర్ ‘దేవర’, బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’, నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత వ్యక్తిగత విషయాల కారణంగా ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ వచ్చారు. దీంతో సినిమా కెరీర్ విషయంలో ఇబ్బందిపడతారా అనే డౌట్ వచ్చింది. కానీ ఏకంగా చిరంజీవి సినిమాలో అవకాశం అందుకున్నారట.
మరి ఆయనతో ఎలాంటి పాత్ర, ఎలాంటి ప్రమోషనల్ వీడియో చేశారో చూడాలి. సంక్రాంతి పండక్కి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే చెప్పింది. దానికి తగ్గట్టుగా సినిమాను వేగంగా అనిల్ రావిపూడి సిద్ధం చేస్తున్నారట. సినిమా సంక్రాంతికి అని చెబుతున్నారు కానీ.. డేట్ మాత్రం చెప్పడం లేదు. ఎందుకు, కారణమేంటి అనేది తెలియడం లేదు.