పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా యాక్టర్.. ఏంటీ తేడా అనుకుంటున్నారా? పాన్ ఇండియా రేంజిలో సినిమాలు చేసేవాళ్లను పాన్ ఇండియా హీరో అంటారు. ఇక పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించేవారిని పాన్ ఇండియా యాక్టర్‌లు అంటారు. ఇప్పుడు అలాంటి పాన్ ఇండియా నటుల మీద ప్రముఖ కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆయన లేటెస్ట్ సినిమా ‘వేద’ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం శివ రాజ్‌కుమార్ పాన్ ఇండియా లెవల్‌లో చాలా భాషల్లో నటిస్తున్నాడు. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో నటించే అవకాశమొచ్చింది. చిన్న పాత్రైనా చాలా బాగుంటుందని శివన్న చెబుతున్నాడు. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలోనూ ఓ పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగులోనూ రెండు మూడు కథలు విన్నారట. అయితే ఏదీ ఖరారు కాలేదని చెప్పారు. ‘‘మనిద్దరం కలిసి చేద్దామని బాలకృష్ణ అన్నారు కదా’’ అని అడిగితే.. చూద్దాం ఏమవుతుందో అంటూ తన సానుకూలత వ్యక్తం చేశాడు.
ఇక పాన్ ఇండియా స్టార్ల గురించి మీరేమంటారు.. అనడిగితే.. నా దృష్టిలో పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. నేను తెలుగులోనూ మాట్లాడతాను కానీ, అంత అనర్గళంగా కాదు. కాస్త సమయం తీసుకొని పర్‌ఫెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటున్నా అని చెప్పారు. శివ రాజ్‌కుమార్ తన గురించి చెప్పినట్లు ఆ మాటలు ఉన్నాయి కానీ.. ఆ మాటలు మొత్తం పాన్ ఇండియా నటులకు వర్తిస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక శివన్నా ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది అని అడిగితే.. ‘అన్నమయ్య’ తరహా భక్తి ప్రధాన చిత్రాలు చేయాలని ఉందని చెప్పాడు. అలాగే ప్రస్తుతం ‘అశ్వథామ’, ‘ఘోస్ట్’, ‘45’, ‘కరటక ధమనక’ తదితర చిత్రాలు చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పటికే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన శివ రాజ్‌కుమార్.. త్వరలో పూర్తి స్థాయి సినిమా చేయాలని ఆశిద్దాం. బాలయ్య మాటలు వింటుంటే త్వరలోనే సాధ్యమయ్యేలా ఉంది.