శ్రేయా ఘోషల్ ఓ సినిమాలో పాట పాడితే.. ఆ సినిమా హిట్టే. ఏంటీ హైప్ అనుకుంటున్నారా? ఇది హైప్ కాదు. కొన్నేళ్ల క్రితం చాలామంది సినిమా అభిమానులు అనుకున్న మాట ఇది. అంతలా తన గాత్రంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసి అలరించారామె. అలాంటి అందమైన, మధురమైన గొంతు ప్రేక్షకులకు పరిచయమై 20 ఏళ్లు పూర్తయింది. ‘దేవదాస్’ కోసం పాట రికార్డు చేస్తున్నప్పుడు శ్రేయ వయసు 16ఏళ్లే. ఇంకా ఇలాంటి చాలా విషయాలను ఆమె తాజాగా ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు.
నా తొలి సినిమా ‘దేవదాస్’ కోసం పాట రికార్డు చేస్తున్నప్పుడు నా చుట్టూ దిగ్గజ సంగీత దర్శకులు, సంగీత విద్వాంసులు ఉన్నారు. స్టూడియో మొత్తం జనంతో నిండిపోయింది. ఆ మూమెంట్‌ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ‘భైరి పియా…’ అంటూ సాగే ఆ పాటకు జాతీయ అవార్డును గెలుచుకుంటానని అప్పుడు అనుకోలేదు. కానీ ఆ ఆనందం కూడా దక్కింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా ఏమీ మారింది అనిపించడం లేదు. నేను ఇప్పటికీ చిన్న అమ్మాయిలానే భావిస్తున్నాను అంటూ మురిసిపోయింది శ్రేయా ఘోషల్.
సంజయ్ లీలా భన్సాలీ అప్పుడు, ఇప్పుడూ అదే అభిరుచితో ఉన్నారు. ఆయనకు దర్శకత్వంలోనే కాదు సంగీతంలోనూ పట్టు9 ఉంది. నేను ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుంటాను అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆయనను కలిసిన తర్వాతే జీవితంలో ఇంకా ఏదో చేయాల్సింది చాలా ఉందని అందరికీ అనిపిస్తుంది. నాకూ అలానే అనిపించింది. సంగీతం పట్ల నాకున్న ప్రేమే.. ఇప్పుడు నన్ను సంగీత ప్రపంచంలో ఈ స్థాయిలో నిలబెట్టిందని భావిస్తున్నాను అని చెప్పింది శ్రేయా ఘోషల్.
నేను పాటల కోసం రికార్డింగ్ థియేటర్‌లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా సంగీతం, పాటల మీదే ధ్యాస ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పియానో పట్టుకుని ఉంటాను. నా ప్రతి పనిలో సంగీతమంటే ఇంట్రెస్ట్ కనపడుతూనే ఉంటుంది. అందుకేనేమో ప్రజలు ఇన్నేళ్లయినా నన్ను ఇంతలా అభిమానుస్తున్నారు అని చెప్పింది శ్రేయా ఘోషల్.