స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!
- June 7, 2025 / 09:48 PM ISTByDheeraj Babu
గత కొన్ని రోజులుగా ఆ నలుగురి వల్ల థియేటర్లు మూసుకుపోతున్నాయి అని రచ్చ జరగ్గా.. ఆ నలుగురిలో మేం లేమంటే మేం లేము అంటూ అల్లు అరవింద్ (Allu Aravind), దిల్ రాజులు (Dil Raju) వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఎనౌన్స్ చేసిన సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయమై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Film Chamber of Commerce) ఒక ప్రెస్ మీట్ పెట్టి అందర్నీ ఏకి పారేసింది.
Film Chamber of Commerce

ముఖ్యంగా.. థియేటర్ల బంద్ అనేది ఎవరూ ప్లాన్ చేయలేదని స్పష్టం చేస్తూ.. ఈరోజున సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎందుకని మూతబడుతున్నాయి అనేందుకు కారణాలు చెప్పుకొచ్చారు కొత్తగా ఎన్నికైన జనరల్ సెక్రటరీ శ్రీధర్. ప్రస్తుతం మన స్టార్ హీరోలు కనీసం ఏడాదికి ఒక సినిమా కూడా చేయడం లేదు, వాళ్లకి స్టార్ డం వచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుండి, అలాంటిది వాళ్లు ఇప్పుడు సినిమాలు చేయకపోతే, రేపన్న రోజు సింగిల్ స్క్రీన్ థియేటర్లే లేకపోతే..
వాళ్లు ఎవరి కోసం సినిమాలు తీసుకుంటారు? స్టార్ డం లు ఎక్కడినుండి వస్తాయి? అని సూటి ప్రశ్నలు సంధించారు. అదే క్రమంలో ఒక యువ కథానాయకుడి చిత్రం ర2 కోట్లు కూడా కలెక్ట్ చేయనప్పటికీ.. 13 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడం అనేది నిర్మాతల తప్పిదంగా శ్రీధర్ పేర్కొన్నారు. త్వరలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ (Film Chamber of Commerce) కలిసి ఒక నిర్ణయానికి వస్తామని, తద్వారా సింగిల్ స్క్రీన్ల సమస్యకు చెక్ పెడతామని శ్రీధర్ చెప్పుకొచ్చారు.

ఈరోజు శ్రీధర్ దెప్పిపొడిచాడని కాకపోయినా.. స్టార్ హీరోలు ప్యాన్ ఇండియన్ సినిమా మోజు మరియు ఇతర భాషా మార్కెట్ ల మాయలో పడి తెలుగు సినిమాని, ప్రేక్షకుల్ని, థియేటర్లని పట్టించుకోవడం మానేశారు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. మరి నిర్మాతలు, హీరోలు ఈ విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి.















