తమకు నచ్చకుంటే ఎంత పెద్ద స్టార్లు అయినా.. తమ అభిమాన హీరో అయినా సరే, ఎలాంటి సినిమానైనా తిప్పికొడతారు ప్రేక్షకులు. దీనికి ఎంత పెద్ద సూపర్ స్టార్లయినా అతీతం కాదు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. అందుకే దర్శక నిర్మాతలు కూడా గుడ్డిగా ఏది పడితే అది తీయకుండా ప్రేక్షకులను మెప్పించే అన్ని రకాల ఎలిమెంట్స్ వుండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. అయినా కూడా సదరు సినిమాలు పరాజయం పాలైన సందర్భాలు కోకొల్లలు.
ఇందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ కూడా బాధితుడే. రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, వెంకటేశ్వరుడిగా తెలుగు ప్రజల నీరాజనలు అందుకున్నారు ఎన్టీఆర్. అయినా ఎలాంటి సినిమా తీసినా చూసేవారు. అన్నగారు నటించిన చిత్రాలు అందరినీ మెప్పించేవిగానే ఉంటాయి. అలాంటిది ఆయనకు ఫలానా సినిమా ఇష్టం అంటే చెప్పడం కాదు.. వందల సంఖ్యలో వున్న ఈ మూవీలు ఒక్కొక్కటి ఒక్కో క్లాసిక్. ఏ పాత్ర వేసినా అందులో పరకాయ ప్రవేశం చేసేవారు రామారావు.
అయితే కెరీర్ ప్రారంభంలో ఆయనకు పిచ్చిపుల్లయ్య సినిమా అంటే బాగా ఇష్టమట. అనంతరం తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకృష్ణ పాండవీయం బాగా నచ్చిందట. ఇలా కాల మాన పరిస్ధితులకు అనుగుణంగా ఎన్టీఆర్ టేస్ట్ ఎప్పటికప్పుడు మారిపోయింది. ఏది ఎలా వున్నా.. అన్నగారికి చారిత్రక నేపథ్యం, జానపదాలు బాగా ఇష్టం. అలాంటి కథలను ఎంచుకుని, తెరకెక్కించేందుకు, నటించేందుకు రామారావు తీవ్రంగా శ్రమించే వారు. ఇలా నటించిన చిత్రాలను ఆయన తన హిస్టరీ ఆఫ్ ఎన్టీఆర్ అనే పుస్తకంలో రాసుకున్నారు.
అలాంటి వాటిలో శ్రీనాథ కవిసార్వభౌమ ఒకటి. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనాథుని జీవిత విశేషాలను తెలియజేశారు.శ్రీనాథుడిగా రామారావు, జయసుధ ఆయన భార్యగా నటించారు. దీనిపై నిర్మాతలు, అభిమానులు సైతం భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎన్టీఆర్ సైతం శ్రీనాథుడి జీవిత చరిత్రను చదివిన తరువాతే ఈ సినిమాకు ఓకే చెప్పారట. కథ బాగా నచ్చడంతో ఆయన ప్రాణం పెట్టారు.. తనకు తానే మేకప్ వేసుకున్నారట.
కానీ అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీనాథ కవి సార్వభౌమ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయినప్పటికీ ఎంతో కష్టపడ్డ సినిమా కావడంతో తన ఆల్‌టైం ఫేవరేట్ మూవీస్‌లో దీనికి చోటిచ్చారు అన్నగారు.