కమర్షియల్ సినిమాల్లో లేదా పెద్ద సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకి నిడివి తక్కువగానే ఉంటుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ వీటి గురించి హీరోయిన్లు బాధపడుతూ చెబితే.. జనాలకి, సినిమా వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంటుంది. గట్టిగా ‘5 పాటలకు, వాటికి ముందు వచ్చే సన్నివేశాల కోసం మాత్రమే హీరోయిన్లు’ అన్నట్టు ఉంటుంది హీరోయిన్ల పరిస్థితి. అంటే సగటున సినిమాలో హీరోయిన్ల పాత్రల నిడివి 30 నిమిషాలు ఉంటుంది. ఇంతకు మించి హీరోయిన్ కనపడుతుంది అంటే.. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది అని ఫిక్స్ అయిపోవచ్చు.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) అందరికీ సుపరిచితమే. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) – యష్ (Yash) కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘కె.జి.ఎఫ్’ (KGF) ద్వారా ఈమె దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత శ్రీనిధి శెట్టి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అందుకు రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు. అందులో ఒకటి శ్రీనిధి శెట్టి… ‘కె.జి.ఎఫ్’ పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది కాబట్టి…
తర్వాతి సినిమాలకి భారీ పారితోషికం డిమాండ్ చేసిందని, అందుకే ఆమెకు అవకాశాలు రావడం లేదని కొందరు అంటుంటారు. మరి కొంతమంది అయితే ‘కె.జి.ఎఫ్’ రెండు భాగాల్లో శ్రీనిధి శెట్టి పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని.. అందుకే ఆమెను దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు అని అంటుంటారు. వీటిపై ‘హిట్ 3’ (HIT 3) ప్రమోషన్స్ లో శ్రీనిధి శెట్టి స్పందించింది. ‘నేను పారితోషికం పెంచడం వల్ల అవకాశాలు పొందలేదు అనేది నిజం కాదు. అలా అనుకుంటే.. కె.జి.ఎఫ్ తర్వాత నాకు బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి.
మంచి పాత్రలు చేసి ఎక్కువ కాలం పని చేయాలి అనే ఉద్దేశంతో వెంటనే వేటికి కూడా ఓకే చెప్పలేదు. ఇక ‘కె.జి.ఎఫ్’ ‘కె.జి.ఎఫ్ 2’ లో (KGF 2) నా పాత్ర నిడివి తక్కువ అవ్వడం వల్ల నేను బిజీ హీరోయిన్ కాలేదు అని అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ‘కె.జి.ఎఫ్’ కోసం నన్ను మేకర్స్ సంప్రదించినప్పుడే.. ఆ సినిమాలో నా నిడివి తక్కువగా ఉంటుంది అని నాకు చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి పెద్ద ప్రాజెక్టు మిస్ అవ్వకూడదు, కచ్చితంగా ఇందులో నేను భాగం కావాలనే ఉద్దేశంతో చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి.