వరుస ప్రమాదాలు, ప్రముఖుల మరణాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.. కైకాల సత్య నారాయణ, నటి జమున కన్నుమూసిన సంగతి మర్చిపోకముందే ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ఇకలేరనే వార్త షాక్‌కి గురి చేసింది.. ఇంకా విశ్వనాథ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుండగానే.. ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం అనుమానాస్పదంగా మరణించారు.అలాగే తమిళ చిత్ర రంగానికి చెందిన తంగరాజ్ అనారోగ్యంతో, వైద్యానికి కూడా డబ్బుల్లేని దుస్థితిలో మృతి చెందారు. ఆదివారం (ఫిబ్రవరి 5) ఉదయం కోలీవుడ్ పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ టీపీ గజేంద్రన్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు..
కె. బాల చందర్, విసు, రామ నారాయణన్ వంటి ప్రముఖ దర్శకుల దగ్గర 60 సినిమాలకు పైగా సహాయకుడిగా పనిచేశారాయన..‘ఎంగ ఊరు కావల్ కారన్’, ‘మిడిల్ క్లాస్ మాధవన్’, ‘బడ్జెట్ పద్మనాభన్’, ‘వీడు మనైవి మక్కల్’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కామెడీ క్యారెక్టర్లతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న గజేంద్రన్.. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆదివారం ఉదయం స్వర్గస్తులయ్యారు. పలువురు సినీ ప్రముఖులు, తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు ఆయన మృతికి నివాళులర్పించారు..
తమిళనాడు సీఎంతో గజేంద్రన్‌కు మంచి స్నేహ బంధం ఉంది.. కళాశాలలో గజేంద్రను తన సహచరుడని, ఆయన మరణ వార్త ఆవేదన కలిగించిందని స్టాలిన్ అన్నారు. అలాగే 2021 సెప్టెంబర్‌లో తనను కలిసి పరామర్శించానని.. సినీ రంగానికి ఎన్నో ఉత్తమ సేవలందించారంటూ సంతాపం తెలియచేశారు. అలాగే సమాచార శాఖా మంత్రి స్వామి నాథన్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు..