పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో భీమ్లా నాయక్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఏపీలో టికెట్ రేట్లు, థియేటర్లలో ఆక్యుపెన్సీని బట్టి ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఏపీలోని థియేటర్లలో పెద్ద సినిమాల విడుదలకు అనుకూల పరిస్థితులు లేవు.
భీమ్లా నాయక్ సినిమాలో బ్రహ్మానందం నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఒక షోలో పాల్గొన్న సమయంలో బ్రహ్మానందం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే పాత్రకు సంబంధించిన వివరాలను మాత్రం బ్రహ్మానందం వెల్లడించలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ మూవీలో బ్రహ్మానందం ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందంకు సినిమా ఆఫర్లు తగ్గాయి. అయితే గతేడాది విడుదలైన జాతిరత్నాలు సినిమాలో బ్రహ్మానందం కామెడీకి మంచి మార్కులు పడ్డాయి.
జాతిరత్నాలు సక్సెస్ సాధించడానికి ఒక విధంగా బ్రహ్మానందం కారణమనే సంగతి తెలిసిందే. పవన్ బ్రహ్మానందం కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధించాయి. ఫారెస్ట్ ఆఫీసర్ రోల్ లో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్ కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలలో బ్రహ్మానందంకు పరిమితంగా ఆఫర్లు వస్తుండగా భీమ్లా నాయక్ సక్సెస్ సాధిస్తే మాత్రం స్టార్ హీరోల సినిమాలలో బ్రహ్మానందంకు ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
భీమ్లా నాయక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్ నటించగా రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథనం, మాటలు అందిస్తున్నారు. పవన్ ఈ సినిమా కొరకు 50 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.