టాలీవుడ్‌లో సినిమా తర్వాత సినిమా.. సినిమా తర్వాత సినిమా వెంటవెంటనే చేసే హీరో… అందులో సీనియర్ హీరో అంటే ఠక్కున గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ. వంద సినిమాలు పూర్తి చేసుకున్నాక బాలయ్య స్టైల్‌లో మార్పొచ్చింది. సగటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే… వాటిలో ఏదో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘భగవంత్ కేసరి’ కూడా అలాంటి సినిమానే. రెగ్యులర్ కమర్షియల్ పంథాలో సాగే వైవిధ్యమైన నేపథ్యమున్న చిత్రమిది. అంతేకాదు ఆ తర్వాత ఆయన చేయబోయే సినిమాలు కూడా అలానే ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే లైనప్ అలా ఉంది మరి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో ముఖ్య పాత్రధారి. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య ఏం చేయబోతున్నాడనేది ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. బాబి దర్శకత్వంలో బాలయ్య 109వ సినిమా ఉంటుంది. దీని కోసం వైవిధ్యమైన పోస్టర్ లాంచ్ కూడా చేశారు. సినిమా ముహూర్తపు షాట్ కూడా తీశారు.
ఈ సినిమా తర్వాత బాలయ్య తన మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబో రూపంలో రాబోతున్నారట. ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ అంటూ హ్యాట్రిక్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందట. ఇది గత మూడు సినిమాల్లో దేనికో ఒకదానికి సీక్వెల్ అవ్వొచ్చు అంటున్నారు. అయితే అందులో రాజకీయం పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటాయట. ఈ కాంబో తర్వాత మరో ఇంట్రెస్టింగ్ కాంబో ఉండొచ్చు. బాలయ్య ఓటీటీ కోసం చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో ప్రోమోస్‌ను అదిరేలా రూపొందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ఉండొచ్చట.
‘అ’, ‘కల్కి’, ‘జాంబి రెడ్డి’, ‘హనుమాన్’ లాంటి వైవిధ్యమైన సినిమాల దర్శకుడు ఆయన. ఇక ఆ సినిమాతోపాటే బాలయ్య మరికొన్ని సినిమాలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని చెబుతున్నారు. ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్ట్, వెంకటేశ్ మహా, పరశురాం, హరీశ్ శంకర్, బీవీఎస్ రవి, వెంకీ అట్లూరి, సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల లాంటి పేర్లు చాలానే వినిపిస్తున్నాయి. ఇక ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ – బాలయ్య కాంబో మళ్లీ ఉందన్నారు.
దీనిపై క్లారిటీ రావాలి. ఆ మధ్య కొరటాల శివ.. (Balayya Babu) బాలయ్యకు ఓ కథ చెప్పారని టాక్ వినిపించింది. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో చూడాలి. ఇక ఆఖరుగా బాలయ్య ఎప్పుడో అనౌన్స్ చేసిన ‘ఆదిత్య 369’ సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ రావాలి. ఆయనే డైరక్ట్ చేస్తామని చెప్పారు. ఇంచుమించు డేట్ కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత ఉలుకూ పలుకూ లేదు.