‘పాటలు హిట్ అయితే.. సినిమా సగం హిట్ అయినట్టే’ అని అంతా అంటుంటారు..! సినిమా హిట్ సాధించడంలో పాటలది కీలకపాత్ర. కేవలం పాటల వల్లనే సినిమాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. అప్పట్లో పాటల క్యాసెట్లు కూడా నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించిన రికార్డులెన్నో ఉన్నాయి. మన తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో మ్యూజిక్ డైరెక్టర్లు బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి నేటి వరకు తమ మ్యూజిక్ టాలెంట్ తో సినీ ప్రేక్షకులను అలరించారు.
అలాంటి వారిలో చక్రవర్తి (K. Chakravarthy) ఒకరు. 80..ల టైంలో మాస్ బీట్ సాంగ్స్‌తో ఆయన టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేశాడు. ముఖ్యంగా కే. రాఘవేంద్రరావు (Raghavendra Rao) – చక్రవర్తి..లది హిట్ కాంబినేషన్. వాస్తవానికి చక్రవర్తి కన్నడంలో సింగర్‌గా కెరీర్ ను ప్రారంభించారు. అలా ఓ 10 ఏళ్ళ పాటు సింగర్..గానే కొనసాగారు. బ్యాక్ గ్రౌండ్ సింగర్ గా ఉంటూనే అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు.అంతే కాదు.. ఆయనలో ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. ఎంజీఆర్, శివాజీ గణేశన్, నగేష్, రాజ్ కుమార్, సంజీవ్ కుమార్ వంటి దిగ్గజ నటులకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.
అలా తన కెరీర్‌లో దాదాపు 600 సినిమాలకు ఆయన గాత్రదానం చేయడం జరిగింది. చక్రవర్తిలో మ్యూజిక్ టాలెంట్‌ను గుర్తించిన నిర్మాత చక్రవర్తి ఆయనను సంగీత దర్శకుడిగా మార్చారు. ‘మూగప్రేమ’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన చక్రవర్తి.. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శారద’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’తో చక్రవర్తి ఇమేజ్ మారిపోయింది. దీంతో ఆయనతో పని చేసేందుకు దర్శక నిర్మాతలు ఎగబడ్డారు. చాలా వేగంగా ట్యూన్ కట్టడం చక్రవర్తికి వెన్నతో పెట్టిన విద్య.
ఇదిలా ఉండగా.. దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) దర్శకత్వంలో శ్రీదేవి (Sridevi), అక్కినేని నాగేశ్వరరావు (ANR), జయసుధ (Jayasudha) నటించిన ‘ప్రేమాభిషేకం’ (Premabhishekam) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ పాటలు వినిపించాల్సిందే. ‘నా కళ్ళు చెబుతున్నాయి’ ‘ఆగదు ఆగదు’ వంటి పాటలైతే క్లాసిక్స్ అని చెప్పాలి. ‘ప్రేమాభిషేకం’ సినిమాలో మొత్తం 7 పాటలు ఉంటాయి. వీటికి చక్రవర్తి (K. Chakravarthy) ఒక్కరాత్రిలోనే ట్యూన్ చేశారంటే నమ్ముతారా.? కానీ ఇది నిజం.
ఒక్క రాత్రిలో ఆయన పాటలన్నీ కంపోజ్ చేశారు. ఆల్బమ్ పెద్ద హిట్ అయ్యింది. ‘ప్రేమాభిషేకం’ సక్సెస్‌లో ఈ పాటలు కూడా కీలకపాత్ర పోషించాయి. అయితే డైరెక్టర్ ఇన్పుట్స్ కరెక్ట్ గా సెట్ అవ్వడం వల్ల షార్ట్ టైంలో ఆ పాటలన్నీ కంపోజ్ చేయడం జరిగింది అని చక్రవర్తి అప్పట్లో పలు సందర్భాల్లో వివరించారు. అటు తర్వాత ఆయన వందల చిత్రాలకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే.