మహేష్ బాబు.. ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడు. కృష్ణ గారి అబ్బాయిగా సినీరంగ ప్రవేశం చేసిన మహేష్ 4ఏళ్ళకే నటించడం మొదలుపెట్టాడు. బాల నటుడిగా అతను 9 సినిమాల్లో నటించాడు. అప్పుడే అతనికి బోలెడంత క్రేజ్ ఏర్పడింది. అయితే అతని చదువు డిస్టర్బ్ అవ్వకూడదని భావించి కృష్ణ గారు మహేష్ ను సినిమాలకి దూరంగా ఉంచేవారట. నిజానికి మహేష్ కంటే ఎక్కువగా రమేష్ బాబుని హీరోగా చేయాలనే ఆలోచన కృష్ణ గారికి ఉండేదట.
కానీ రమేష్ బాబుకి ఆశించిన ఆదరణ లభించలేదు. దాంతో కృష్ణ గారు మనసు మార్చుకుని మహేష్ ను హీరోగా లాంచ్ చేశారు. ‘రాజకుమారుడు’ తర్వాత నాలుగైదు సినిమాల వరకు మహేష్ సినిమా కథల్ని కృష్ణగారే సెలెక్ట్ చేసేవారు. ఆ టైంలో తన అభిరుచిని పక్కన పెట్టేసాడట మహేష్. అటు తర్వాత మహేషే సొంతంగా కథలు ఎంపిక చేసుకునే వాడట. ఈ విషయాలన్నింటినీ టాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత చెప్పుకొచ్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. ‘రాశి మూవీస్’ అధినేత అయిన సీనియర్ నిర్మాత నరసింహారావు.. మహేష్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ‘గతంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించాలని అనుకున్నాను. కానీ ఆ టైములో నేను శోభన్‌బాబుతో కూడా మరో సినిమా నిర్మిస్తుండటంతో కోడి రామకృష్ణ సినిమా వేరే పార్టనర్ కు అప్పగించాను. అదే ‘గూడచారి 117’ చిత్రం. మహేష్ బాబు కూడా ఆ చిత్రంలో నటించాడు. చిన్నప్పుడు నాతో ఎంతో సన్నిహితంగా ఉండే వాడు మహేష్.
చిన్న సైకిల్ పై తిరిగేవాడు. ఆ టైంలోనే మహేష్‌తో సినిమా చేయాలనే ఉద్దేశంతో అతనికి రూ.500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను.నాకు డేట్స్ ఇవ్వాలని అడిగితే… డేట్లు అంటే ఏంటని ప్రశ్నించాడు.? అయితే ఆ విషయం మహేష్ బాబుకు గుర్తుందో లేదో నాకు తెలీదు కానీ… మహేష్ స్టార్ అయ్యాక ఒకసారి కలిసాను. ఆ టైములో ‘మంచి సబ్జెక్ట్ ఉంటే తీసుకొని రమ్మని కచ్చితంగా సినిమా చేద్దామని’ మహేష్ చెప్పాడు’ అంటూ నరసింహారావు చెప్పుకొచ్చారు.