సెలబ్రిటీలు సరోగసీ ద్వారా పిల్లలను కనడం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు సరోగసీ ద్వారా తల్లితండ్రులయ్యారు. అయితే ఈ విషయంలో విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, పిల్లలు పుట్టే అవకాశం లేని వాళ్లు ఈ మార్గాన్ని ఎన్నుకుంటే ఓకే కానీ.. అందం చెడిపోతుందనే భయంతో, పురిటినొప్పులు భరించాలని బాధతో ఈ మార్గం ఎన్నుకోవడం తప్పంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.సెలబ్రిటీలు సరోగసీ ఆప్షన్ ఎన్నుకునే ప్రతీసారి ఈ విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది.
తాజాగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ కలిసి సరోగసీ ద్వారా బిడ్డను కన్నట్లు తెలియగానే సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేశారు. ఎవరో ఆకతాయిలు ఇలాంటి కామెంట్స్ చేస్తే పెద్దగా పట్టించుకోరు కానీ ఒక సెలబ్రిటీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే మాత్రం అది కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. ఇస్లాం మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రపంచవ్యాప్తం గుర్తింపు పొందిన బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్..
డబ్బున్న వాళ్లు సరోగసీ ద్వారా బిడ్డను కనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘ధనవంతులైన మహిళలు కూడా సరోగేట్ మామ్ గా మారనంతవరకు నేను సరొగసీను ఒప్పుకోను. పురుషులు బుర్ఖాను వేసుకొనే వరకు నేను దానిని సమర్థించను. సరోగసీ, బుర్ఖా అనేవి పేదలు, మహిళలను దోపిడి చేసేందుకే’ అని తన ట్వీట్ లో రాసుకొచ్చింది. నిక్, ప్రియాంకల పేర్లు ఎత్తకపోయినా.. వారు సరోగసీ విషయాన్ని చెప్పిన మరుసటిరోజే తస్లీమా ఈ ట్వీట్ వేయడం వివాదాస్పదమైంది.
ఈ విషయంలో చాలా మంది తస్లీమాను ట్రోల్ చేశారు. ప్రియాంకను విమర్శించే హక్కు నీకు లేదంటూ మండిపడ్డారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది తస్లీమా. నిక్, ప్రియాంక అంటే తనకు ఇష్టమని.. వారిని ఉద్దేశించి తను ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. కొందరు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది.