సినిమా చూశాక ఒక్కొక్కరు అభిప్రాయం చెబుతారు. అవి ఆ సినిమా టీమ్‌కి నచ్చకపోవచ్చు. ఒక్కోసారి ఆ మాటలు బాగా హర్ట్ చేయొచ్చు కూడా. అలా వంశీ పైడిపల్లి ఓ కామెంట్ విషయంలో చాలా హర్ట్ అయ్యారు.విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి ‘వారిసు’ అనే తమిళ సినిమా తెరకెక్కించారు. తెలుగులో ఆ సినిమాను ‘వారసుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సంక్రాంతి కానుకగా ఆ సినిమా 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆ సినిమా విషయంలో నెగిటివ్ ట్రోల్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ట్రోల్‌పై వంశీ స్పందించారు.
భారీ అంచనాలతో తమిళంలో ఓ రోజు, తెలుగులో ఇంకో రోజు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సోసో అనిపించుకున్నా.. ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. ఇటీవల సినిమాను ఓ ‘డైలీ సీరియల్’తో పోలుస్తూ కొన్ని పోస్ట్‌లు సోషల్ మీడియాలో కనిపించాయి. ఆ కామెంట్స్‌పై వంశీ పైడిపల్లి అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీరు చెబుతున్న ఆ డైలీ సీరియల్సే ఎంతోమంది ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా తీయడం సాధారణ విషయమేమీ కాదు’’ అంటూ వంశీ పైడిపల్లి మండిపడ్డారు.
సినిమా అనేది టీమ్ వర్క్. సినిమా తీయడం చాలా కష్టమైన ప్రక్రియ. ప్రేక్షకులను అలరించడానికి మేమెంత శ్రమపడతామో మీకు తెలుసా సోదరా… అయినా ఇదేమీ జోక్ కాదు. ప్రతి సినిమా వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి అంటూ తన బాధను మాటల రూపంలో చెప్పారు వంశీ. దేశంలోని సూపర్‌స్టార్స్‌లో విజయ్ ఒకరు. సినిమా కోసం ఆయన చాలా కష్టపడతారు. పాటలు, సీన్స్ కోసం ఆయన ఎన్నోసార్లు రిహార్సల్స్ చేస్తారు. అయినా మనం సినిమా మాత్రమే తీయగలం… ఫలితం కాదు అంటూ కాస్త వేదాంత ధోరణిలోకి వెళ్లిపోయారు వంశీ.
సినిమాను డైలీ సీరియల్‌తో పోల్చడం ఏంటి. సాయంత్రమైతే ఎంతమంది టీవీలు చూస్తారో మీకు తెలుసా. మీ ఇళ్లలో చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సీరియల్ చూస్తూ ఉంటారు. అలాంటి సీరియల్స్‌ను ఎందుకు కించపరుస్తున్నారు అని వంశీ పైడిపల్లి అసహనం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా ఎవరినైనా కిందకు లాగాలంటే నిన్ను నీవు కిందకు లాక్కున్నట్లే. ప్రతి విషయంలో అంత నెగెటివ్‌గా ఉండకండి. మీరు నెగెటివ్‌గా ఆలోచించడం మొదలు పెడితే, అదే మిమ్మల్ని తినేస్తుంది అంటూ క్లాస్ పీకారు వంశీ.