సూపర్ స్టార్ కైనా.. సామాన్యులకైనా న్యాయం ఒకటేనని ధర్మాసనం తేల్చి చెప్పిన సంఘటన తాజాగా మరొకటి జరిగింది. తన ఆదేశాలను పట్టించుకోనందుకు దక్షిణ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు.. తీర్పు .. వివరాల్లోకి వెళితే… సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2014లో “కొచ్చాడియాన్” అనే సినిమాని సౌందర్య తెరకెక్కించారు. ఈ సినిమా నిర్మించిన సంస్థల్లో రజనీ కాంత్ భార్య లతా రజనీకాంత్ కు చెందిన మీడియా వన్ గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ కూడా ఉంది. ఈ చిత్ర నిర్మాణం నిమిత్తం బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో సంస్థ నుంచి లత 6.20 కోట్లు అప్పుగా తీసుకుంది. ఆ అప్పును తమకు చెల్లించడం లేదంటూ సదరు సంస్థ కోర్టును ఆశ్రయించినది.
జులై 3వ తేదీలోగా తీసుకున్న మొత్తాన్ని “యాడ్ బ్యూరో”కు చెల్లించాలని గత ఫిబ్రవరిలో కోర్టు ఆదేశించింది. గడువు పూర్తయినా లతా రజనీకాంత్ స్పందించకపోవడంపై జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా నిర్మాణం కోసం తీసుకున్న అప్పును చెల్లించకపోగా, విచారణ ఎదుర్కోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటూ కోర్టు మందలించింది. కోర్టు ఆదేశాలను పక్కనపెట్టడం మంచిది కాదని పేర్కొన్న న్యాయస్థానం, ఆమె కోర్టుకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని.. ఇప్పుడైనా విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే మంచిదని ధర్మాసనం హితవుపలికింది. కోట్లు సంపాదిస్తున్న రజినీకాంత్ ఈ సమస్యను కోర్టుదాకా ఎందుకు తీసుకెళ్లారని ? అతని అభిమానులు అయోమయంలో ఉన్నారు.