సంగీత దర్శకుడు తమన్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆరో తరగతి చదువుతుండగానే తండ్రి శివకుమార్ కన్నుమూశారు. అప్పటి పరిస్థితుల గురించి తమన్ ఇటీవల ఓ టీవీ షోలో వెల్లడించారు. తన తండ్రి ఎలా చనిపోయింది, అప్పటికి కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ల మాతృమూర్తి ఆ పరిస్థితిని ఎలా డీల్‌చేశారు లాంటి వివరాలను తమన్ వివరించారు. దానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. తండ్రితో తమన్ ఉన్న ఫొటోను హోస్ట్ అలీ స్క్రీన్‌పై చూపించారు.
దాన్ని చూసిన తమన్… నాటి విషయాలను చెప్పుకొచ్చారు. ఆ ఫొటోను దిల్లీలో తన అత్తగారి ఇంట్లో తీశామని, అదే ఆఖరిదని చెప్పుకొచ్చారు. అక్కడి నుండి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి చెన్నై వస్తుండగా… మార్గమధ్యంలో తన తండ్రికి తీవ్రమైన గుండెపోటు వచ్చిందట. ఆ రైలు ఎక్కడా ఆగే అవకాశం లేకపోయింది. తీరా రైలు ఆగి ఆసుపత్రికి చేరే సరికి ఆయన ప్రాణాలు విడిచారని తమన్ చెప్పుకొచ్చారు. రైల్వే స్టేషన్ ఎదుట ఓ ప్రభుత్వ ఆసుపత్రి ఉందని, అక్కడికి వెళ్తే బాగుండేదని, కానీ వెళ్లలేదని చెప్పాడు తమన్. అయితే ఎందుకు వెళ్లలదేనేది ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.
ఇక తండ్రి చనిపోవడంతో తమన్ మీదే కుటుంబ భారం పడిందట. దాంతో అంతంతమాత్రంగా సాగుతున్న చదువు మానేసి…కుటంబ పోషణకు సిద్ధమయ్యారట తమన్. తండ్రి చనిపోవడంతో వచ్చిన ఎల్‌ఐసీ డబ్బులు ₹60 వేలు తనకే ఇచ్చేశారట తమన్ తల్లి. అమ్మ, చెల్లిని ఎలా చూసుకోవాలి అని తమన్ అనుకుంటుడగా… ఎల్‌ఐసీ డబ్బుతో డ్రమ్స్ కొని ఇచ్చారట తమన్ తల్లి. వాటితోనే తమన్ జీవితం, కుటుంబం ముందుకు సాగిందట. అలా నందమూరి బాలకృష్ణ ‘భైరవ ద్వీపం’తో ఆయన మ్యూజీషియన్ కెరీర్ ప్రారంభమైంది.
ఆ సినిమాకు పని చేసినందుకుగాను తమన్‌కు ₹30 ఇచ్చారట. అదే తన తొలి సంపాదన అని చెప్పారు తమన్. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ… స్టార్ సంగీత దర్శకుడిగా మారారు. శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’లో తమన్ ఓ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 20 ఏళ్లకు ఇప్పుడు అదే శంకర్ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.