బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించాలని ఏ సంగీత దర్శకుడు ఉండదు చెప్పండి. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే నాలుగేళ్ల క్రితం తొలి బాలీవుడ్ సినిమాకు సంగీతం అందించిన ఓ మ్యూజిక్ డైరక్టర్… ఆ తర్వాత మరో సినిమాలే చేశాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి లేదంటున్నాడు. అంతేకాదు ఏకంగా బాలీవుడ్ సినిమాల సంగీతంపై సెన్సేషనల్ కామెంట్లు చేస్తున్నాడు. పోనీ గతంలో చేసిన సంగీతానికి మంచి పేరు రాలేదా? అంటే అద్భుతమైన పేరు వచ్చింది అని చెప్పాలి. కానీ ఆ సినిమాలు వద్దు అంటున్నాడు.
ఆ సంగీత దర్శకుడే తమన్. అవును మన తమనే. ఇంతకీ బాలీవుడ్ సినిమాల గురించి ఏమన్నాడంటే… తమన్ ఇప్పటివరకు బాలీవుడ్‌లో ‘గోల్‌మాల్: అగైన్’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ సినిమాలకు పని చేశాడు. తొలి సినిమాలో ఓ పాటకు సంగీతం ఇచ్చారు. ‘సింబా’కి బ్యాగ్రౌండ్ స్కోర్, ఓ థీమ్ పాట ఇచ్చాడు. ఇక ఆఖరి సినిమాకు అయితే బ్యాగ్రౌండ్ స్కోరులో కొంత పార్ట్ ఇచ్చాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇన్ని తక్కువ బాలీవుడ్ సినిమాలా అని అడిగితే… ‘బాలీవుడ్‌లో సంగీతం స్టైల్ నచ్చడం లేదు. పాటకొకరు సంగీతం అంటున్నారు.
రీల్‌కొకరు ఆర్‌ఆర్’ అంటున్నారు. ఈ విధానం నాకు నచ్చలేదు అని చెప్పుకొచ్చాడు తమన్. అంతేకాదు ఇదంతా చూస్తుంటే ‘పెళ్లి ఒకరితో ఫస్ట్ నైట్ మరొకరితో’ అన్నట్లుగా ఉంది అని కూడా కామెంట్ చేశారు. అందుకే బాలీవుడ్‌లో సంగీతం అంటే అంత ఆసక్తి లేదు అని చెప్పుకొచ్చాడు తమన్. అయితే తమన్ ఇప్పటివరకు సంగీతం అందించిన సినిమాలన్నీ రోహిత్ శెట్టివే. మళ్లీ రోహిత్ ఇంకో సినిమా స్టార్ట్ చేసి తమన్‌కు మ్యూజిక్ చేయమని అడిగితే… చేస్తారో లేదో చూడాలి.
మరోవైపు ‘పుష్ప 2’కి బ్యాగ్రౌండ్ సంగీతం తమన్‌తో చేయించాలి అంటూ ఫ్యాన్స్ ట్విటర్‌లో అల్లు అర్జున్‌కు, దర్శకుడు సుకుమార్‌కు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. మరిప్పుడు తమన్ సంగీతం గురించి ఇలాంటి కామెంట్లు చేసిన నేపథ్యంలో ఇలా ‘పుష్ప 2’కి కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే ఇవ్వండి అంటే ఇస్తాడో లేదు. మరి తమన్ కామెంట్స్ మీద బాలీవుడ్ నుండి ఎవరైనా రియాక్ట్ అవుతారా? లేక ఇది పెద్ద విషయం కాదని వదిలేస్తారా అనేది చూడాలి.