తమన్ సంగీతమందించిన పాటలు రిలీజ్ అయ్యాయంటే చాలు… ఏ పాట ఎక్కడి కాపీ కొట్టేశాడు? ఎక్కడి నుండి స్ఫూర్తి పొందాడు అంటూ శోధించడం మొదలుపెట్టేస్తారు. ఆ వివరాలు పట్టుకొని ట్రోలర్స్ ఇక రెడీ అయిపోతారు. తమన్ తలకాయలు తీసుకొని ఏదేదో ఫొటోలకు పెట్టేసి ట్రోలింగ్ మొదలుపెట్టేస్తారు. ఈ విషయంలో గతంలో కొన్ని సందర్భాల్లో స్పందించిన తమన్… ఆ తర్వాత లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ మధ్యలో ట్రోలర్స్ కాస్త వేడి పెంచినా…
ఆ తర్వాత కాలంలో తమన్ ఇంకా లైట్ తీసుకోవడం మొదలుపెట్టాడు. అసలు తమన్‌కు అంత కూల్‌నెస్ ఎలా వచ్చింది. ట్రోలింగ్‌ను ఎందుకు అంతగా పట్టించుకోవడం లేదు అనే డౌట్ మీకూ వచ్చింది ఉంటుంది. దీని కారణం తమన్ ఇటీవల చెప్పుకొచ్చాడు. తమన్ ఇంట్లో అందరికీ సంగీతానికి సంబంధించిన వాళ్లే. తమన్ మాతృమూర్తి, శ్రీమతి… ఇద్దరూ సింగర్సే. దాంతోపాటు సంగీతం గురించి పూర్తి అవగాహన ఉంది. అందుకే తమన్ చేసే సంగీతం, పాటల గురించి వాళ్లే ముందు కామెంట్స్ చేస్తారట. ట్రోలింగ్ కూడా చేస్తారట.
దీంతో బయట వచ్చే ట్రోల్స్ పెద్దగా కనిపించవు అని చెప్పారు తమన్. ఒక్కోసారి తమన్ వాళ్ల అమ్మ. కూరలో ఉప్పు ఎక్కువేసేసి… ‘ఏంట్రా పాట?’ అంటూ అంటుంటారట. ‘‘అలాంటి ట్రోల్స్ చూసిన నాకు… బయట సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ పెద్ద విషయంలా’ అనిపించవు అని అన్నారు తమన్. నిజమే కదా ఇంట్లో వచ్చే విమర్శల కంటేనే బయటవి. తమన్ పాటల విషయంలో ట్రోలింగ్ ఇటీవల తగ్గింది కానీ… ఒకప్పుడు తెగ వచ్చేవి.
పాట రావడం ఆలస్యం, ఏ సినిమా పాటలో ఏ బిట్ ఎత్తేశారు అంటూ లెక్కలేసేవారు. అలాగే నేపథ్య సంగీతం విషయంలో కూడా ఇలానే చేసేవారు. దీనిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చేవి. అయితే ‘అరవింద సమేత’ తర్వాత తమన్‌లో చాలా మార్పు వచ్చింది. వరుస సినిమాలు చేస్తూనే కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే ‘అఖండ’ సినిమా ఆర్‌ఆర్ విషయంలో డప్పుల మోత ఎక్కువైంది అనే విమర్శ వచ్చింది. ‘అఖండ’ సంగీతంపై తమన్ స్పందిస్తూ…
తెరపై శివుడి దిగి తాండవం ఆడుతుంటే… ఆ మాత్రం సంగీతం తప్పదు అని అన్నాడు. శివాలయానికి వెళ్లి అభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడ శంఖం, గంట, డ్రమ్స్ వాయిస్తారు. మనం అప్పుడు సంగీతం సౌండ్ తగ్గించమని అడగలేం కదా. అలానే ఆ సినిమాలో ఆ సీన్‌లో తప్పదు అని చెప్పాడు. దీనిపై ట్రోలర్స్ తమదైన శైలిలో విమర్శలతో రెడీ అయిపోతారు. వాటిని తమన్ ఎలాగూ పట్టించుకోడు.