ఒక సినిమా హిట్ అయింది అంటే వినిపించే పేర్లు చాలానే వినిపిస్తాయి. అదే సినిమా పోయింది అంటే హీరో పేరే ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే హీరో కథ ఎంపిక బాలేదు, పాత్ర సెలక్షన్ బాలేదు అంటూ రకరకాల ఆలోచన వచ్చేస్తుంటాయి. అలా అనేకంటే పుట్టించేస్తుంటారు అని చెప్పాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విషయంలో ‘ఫ్యామిలీ స్టార్’ (The Family Star) సినిమా గురించి ఇదే జరుగుతోంది. ఆ సినిమా సరైన ఫలితం అందుకోకపోవడానికి మొత్తంగా విజయ్ దేవరకొండనే అనే మాట పుట్టించారు.
కట్ చేస్తే.. సినిమా ఓటీటీలోకి వచ్చేసేసరికి అసలు విషయం బయటకు వచ్చేసింది. థియేటర్‌లో సినిమా వచ్చినప్పుడు చూడనివాళ్లు.. ఇప్పుడు చూసి ఇందులో విజయ్ తప్పేముంది అంతా చేసింది దర్శకుడే కదా అని అంటున్నారు. ఎందుకంటే సినిమాలో అనవసర విషయాలు, అక్కర్లేని అంశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. అలాగే సినిమాను ప్రమోట్ చేసినదానికి, ఇప్పుడు సినిమాకు ఎక్కడా పోలిక లేదు అని అంటున్నారు. కొందరైతే ‘నాన్ ఫ్యామిలీ’ స్టార్ అని అంటున్నారు.
ఈ నెల 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడతారని, వాళ్లే వచ్చి చూస్తున్నారు అంటూ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక పాయింట్ టు పాయింట్ డిస్కషన్ పెడుతున్నారు. ఈ క్రమంలో రవిబాబు ఆఫీసు దగ్గరకు వెళ్లి విజయ్ దేవరకొండ వార్నింగ్ ఇచ్చే సీన్ నుండి చర్చ మొదలైంది. పిల్లల్ని, పెద్దవాళ్లను తీసుకెళ్లి ఆ ఫైట్ అవసరమా? ఫైట్ ఆఖరులో రవిబాబు (Ravi Babu) ఫ్యామిలీ మెంబర్స్‌ను లాగడం అవసరమా? అనే చర్చ వస్తోంది.
ఇదొక్కటే కాదు యుఎస్‌లో హీరో డబ్బు కోసం మేల్ ప్రాస్టిట్యూట్‌గా మారే సన్నివేశం మీద కూడా విపరీతంగా ట్రోలింగ్ అవుతోంది. దీంతో ఇలాంటి సన్నివేశాలు రాయడం ఎందుకు అనే చర్చ కూడా ఉంది. ట్రైలర్ కట్ చూస్తున్నప్పుడు భార్యాభర్తల కథ అనే ట్రాన్స్‌లోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. కానీ సినిమా చూస్తే అది కాదు. దీంతో సినిమాకు కనెక్షన్ పోయింది అని చెబుతున్నారు.