ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘రాజాసాబ్’(The Rajasaab) సినిమా టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. దర్శకుడు మారుతి (Maruthi Dasari) రూపొందిస్తున్న ఈ చిత్రం, ఆరంభంలో చిన్న స్థాయి సినిమాగా అనిపించినప్పటికీ, రానురాను భారీ అంచనాలను సృష్టిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, హర్రర్ ఎంటర్‌టైనర్ జానర్‌లో రూపొందుతోందని, ప్రభాస్ ఫన్ అండ్ ఫియర్ ఎలిమెంట్స్‌తో అభిమానులకు కొత్త అనుభవాన్ని అందించనుందని సమాచారం. ‘రాజాసాబ్’ సినిమా అత్యంత ఆకర్షణీయ అంశం దాని సీజీ వర్క్.
ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నారు. సినిమా కోసం ఏఐ ద్వారా గుడ్లగూబలు, పాములు, మొసళ్లు వంటి జంతువులను సృష్టించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ జంతువులు కథలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి, హర్రర్ ఎలిమెంట్స్‌తో ఎలా ముడిపడతాయనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీజీ వర్క్ లిమిట్ లేకుండా ఉండటం ఈ సినిమాను విజువల్ ట్రీట్‌గా మార్చనుందని అంటున్నారు.
ప్రభాస్ గతంలో ‘బాహుబలి’(Baahubali), ‘సలార్’ (Salaar) లాంటి సీరియస్ యాక్షన్ సినిమాలతో అభిమానులను అలరించాడు. అయితే, ‘రాజాసాబ్’తో ఫన్ జానర్‌లో తన టాలెంట్‌ను చూపించడానికి సిద్ధమవుతున్నాడు. మారుతి (Maruthi Dasari) స్టైల్‌లో హర్రర్, కామెడీ, ఎమోషన్స్ మిళితమైన కథతో ఈ సినిమా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇవ్వనుందని టాక్. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది, సంజయ్ దత్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
త్వరలో ప్రభాస్ కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఇంకా కొన్ని రోజుల షూటింగ్, పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. 2025 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘రాజాసాబ్’ విడుదల కానుందని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.