అడయార్, గెరుగంబాక్కంలో ఎంటీసీ బస్సులో ఫుట్ బోర్డ్ ప్రయాణం చేసిన విద్యార్థులపై చేయి చేసుకోవడంతో పాటు.. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్లను పరుష పదజాలంతో దూషించినందుకు.. బీజేపీ కళలు సాంస్కృతిక విభాగ రాష్ట్ర కార్యదర్శి, సినీ, బుల్లితెర నటి రంజనా నాచ్చియార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను శనివారం ఉదయం అరెస్టు చేశారు. శుక్రవారం గెరుగంబాక్కంలో ఎంటీసీ బస్సులో కొందరు పాఠశాల విద్యార్థులు ఫుట్‌బోర్డుపై నిలిచి ప్రమాదకర రీతిలో ప్రయాణించడాన్ని చూసిన ఆమె..
బస్సును ఆపి డ్రైవర్‌పై మండిపడ్డారు. ఆ తర్వాత ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తున్న విద్యార్థులందరినీ దిగమని కోరగా వారు నిరాకరించారు. దీంతో కొందరు విద్యార్థులపై ఆమె చేయి చేసుకున్నారు. అదే సమయంలో కండక్టరును దుర్భాషలాడారు. ఈ సంఘటనకు సంబంధించి సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోలు ఒక సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత బస్సు డ్రైవర్ శరవణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, రంజనా నాచ్చియార్‌ను శనివారం ఉదయం అరెస్టు చేశారు.
అయితే, రంజనాను (Ranjana) అరెస్టు చేయడంపై పలువురు తప్పుబడుతున్నారు. సాధారణంగా ఫుట్‌బోర్డులో ప్రయాణించడం ప్రమాదకరం. అలాంటిది శుక్రవారం కొందరు విద్యార్థులు బస్సు కిటికీల్లో నిలబడి, వేలాడుతూ అత్యంత ప్రమాదకరస్థాయిలో ప్రయాణం చేశారు. అలాంటి విద్యార్థులను ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన రంజనాను అరెస్టు చేయడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, పోలీసులు అరెస్టు చేసిన రంజనా నాచ్చియార్‌కు శ్రీపెరంబుదూరు కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. అయితే, 40 రోజుల పాటు మాంగాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలన్న నిబంధన విధించింది.