‘వకీల్ సాబ్’కి సీక్వెల్.. ఈ మధ్య కాలంలో ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఈ మాటకు పవన్ అభిమాని అయినా సరే.. అలాంటి పుకారే ఎక్కడా రాలేదు అనే సమాధానం వస్తుంది. అయితే ఇటలీవల సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వార్త బయటకు వచ్చింది. దీంతో ఇదేంటి సడన్‌గా అని అనుకున్నారు కొందరు. మరికొందరైతే.. ఆ లుక్ అండ్ ఫీల్‌లో పవన్‌ను చూడాలని ఆతృతగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ను పవన్ ఇప్పుడు ఓకే చేస్తుండటానికి ఓ కారణం ఉంది అని చెబుతున్నారు.
రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తానంటూ 2019 ఎన్నికల సమయంలో పవన్ అన్నాడు. అయితే ఆ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమానే ‘వకీల్ సాబ్’. పవన్ కల్యాన్ రెగ్యులర్ ఫార్ములాకి దూరంగా రూపొందిన సినిమా అయినప్పటికీ.. అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ అందులో ఉన్నాయి. దీంతో సినిమాకు మంచి పేరు, డబ్బు వచ్చాయి. పనిలో పనిగా రాజకీయంగా తనకు కావాల్సిన అంశాలను పుష్కలంగా దట్టించాడు అనొచ్చు. సగం పూర్తయిన సినిమాలకే డేట్స్ సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సమయంలో కొత్త సినిమా అంటున్నాడు అంటే..
దానికి పెద్ద కారణం ఉండాలి. ఇప్పుడు మరోసారి తన రాజకీయ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట. దీని కోసం ‘వకీల్ సాబ్ 2’ సినిమాను వేదికగా చేసుకుందామని చూస్తున్నాడట. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఏడాది దూరంలో ఉన్నాయి. దీంతో సినిమా – రాజకీయ సిద్ధాంతం ఒకటి చేసే సినిమా ‘వకీల్ సాబ్ 2’ అవుతుందని టాక్.
ఏదైనా ఓ వర్గంలో సమస్యను కోర్టు మెట్లు ఎక్కించి.. దాని మీద కాన్సెప్ట్, మాటలు బాగా దట్టించి (Vakeel Saab) సినిమా చేస్తారు అని అంటున్నారు. దీంతో ఈ సినిమాలో ఏ అంశం గురించి మాట్లాడతాడు పవన్ అనే చర్చ నడుస్తోంది. ఏపీలో ఉన్న ఏ సమస్యను హైలైట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.