సాధారణంగా సెలవులు వచ్చాయంటే కుటుంబమంతా కలిసి సినిమాకి వెళ్దాం అనుకొంటారు. కానీ సినిమాలకే సెలవులిస్తే పరిస్థితి ఏంటి?. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ కన్ఫ్యూజన్ చోటు చేసుకొని ఉంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు నిర్మాతలను అడ్డంగా దోచేయడం పట్ల కోపంతో నెలరోజులపాటు బంద్ ప్రకటించిన చిత్రసీమ ఈమేరకు అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా జారీ చేసింది. దాంతో మార్చి 2వ తారీఖు నుంచి సింగిల్ స్క్రీన్స్ మూతపడనుండగా.. మల్టీప్లెక్స్ లలోనూ హిందీ లేదా ఇంగ్లీష్ సినిమాలు అందుబాటులో ఉంటాయి తప్ప తెలుగు సినిమాలుండవు.
ఎగ్జామ్స్ సీజన్ కావడంతో మాములుగానే మార్చి నెలలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ అవ్వవు, ఆ టైమ్ లో కలెక్షన్స్ కూడా వీక్ గానే ఉంటాయి. అయితే.. రెగ్యులర్ గా సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులకు మాత్రం ఈ బంద్ ఇబ్బందికరమే. ముక్క లేనిదే ముద్ద దిగని వారి తరహాలో సినిమా చూడనిదే వారం గడవని తెలుగు ప్రేక్షకులుంటారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ అంటే హిందీ, ఇంగ్లీష్ సినిమాలతో సరిపెట్టుకొంటారు సరే. మరి తెలుగు సినిమా అభిమానుల సంగతేంటో చూడాలి.