మహా నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై సినిమాను తీస్తానని ఆయన తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ చెప్పడంతో నందమూరి అభిమానులు సంబర పడ్డ మాట వాస్తవమే కానీ, కొంతమంది రాజకీయనాయకులు విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవినుంచి ఎలా దిగిపోయారు అనే విషయాన్నీ వివరంగా చెప్పాలని, లేకుంటే కోర్టుకు వెళుతామని హెచ్చరించారు. ఈ వివాదం రోజు రోజుకి పెద్దది అవుతుండడంతో వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ చిత్రాన్ని నిర్మించనున్న విష్ణు ఇందూరి స్పందించారు. ఎన్టీఆర్ బయో పిక్ లో రాజకీయ ప్రస్తావన ఉండదని స్పష్టం చేశారు. కేవలం ఆయన యవ్వనం, సినిమా రంగంలో నంబర్ వన్ గా ఎదిగిన వైనాన్ని చూపిస్తామని తెలిపారు.
కనీసం బాలకృష్ణ, హరికృష్ణ ల గురించి కూడా చెప్పమని వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకొని బాలకృష్ణ మంచి పనిచేశారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. లేదంటే నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దెబ్బతినేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. నేటి తరానికి ఆనాటి సంగతులు గుర్తుచేయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుందని బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఎన్టీఆర్ జయంతి మే 28న ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.