రాజమౌళితో సినిమా అంటే సంవత్సరాలు పట్టాల్సిందే అంటుంటారు టాలీవుడ్ జనాలు. అయితే ఆయన కెరీర్ ప్రారంభం నుండి ఇలా లేదు కానీ, ‘బాహుబలి’ మొదలుపెట్టాక పరిస్థితి ఇలా మారిపోయింది. ఆ సినిమా సుమారు ఐదేళ్లు తీసుకోవడంతో రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్ జరగాల్సిందే అని అన్నారు. ఎంతగా ఆ విషయం ట్రోల్ అయ్యింది అంటే… ‘బాహుబలి 1’ ఆడియో ఫంక్షన్‌లో ఆ విషయాన్ని ఆయనే సెల్ఫ్ ట్రోల్ చేసుకునేంత. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు కారణం ఒక్కటే కాదు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా నవంబరు 2018లో మొదలైన విషయం తెలిసిందే. తొలి రోజుల్లో చిత్రీకరణ వేగంగా సాగింది. దీంతో చెప్పిన టైమ్ (జులై 30,2020) కి సినిమా వచ్చేస్తుంది అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల సంక్రాంతి కానుకగా జనవరి 8, 2021కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ కారణంతో సినిమాను మళ్లీ వాయిదా వేశారు. కొత్త డేట్‌గా అక్టోబరు 13, 2021 అని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ డేట్‌కి వచ్చేలా లేదు. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తారని సమాచారం.
అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ‘బాహుబలి’ షూటింగ్ అన్ని రోజులు జరిగిందన్నా, సినిమా అన్నిసార్లు వాయిదా పడిందన్నా అంతా రాజమౌళి వల్లనే. నాణ్యత కోసమో లేక ఇంకే కారణమో కానీ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వాయిదా వెనుక కూడా తొలిసారి రాజమౌళినే కారణం. రెండోసారి కరోనా కారణం అని తెలిసిందే. దీంతో సినిమా వాయిదా ఆయన ఖాతాలో పడలేదు. ఇప్పుడు మరోసారి వాయిదా పడుతుంది అంటున్నారు .. అది కూడ కరోనా ఖాతాలోనే పడుతుంది. అలా రాజమౌళి కాస్త ఊపిరి పీల్చుకోవచ్చేమో.